ఈ వేసవికి మొదట వచ్చిన 'రంగస్థలం' చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక తాజాగా మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం దానిని దాటి వెళ్లేందుకు శరవేగంతో దూసుకెళ్తోంది. ఇక ఇప్పుడు అందరి చూపు మే 4న విడుదల కానున్న అల్లుఅర్జున్ చిత్రం 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'పైనే. తాజాగా ఈచిత్రం ఆడియో వేడుక పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలంలోని మిలటరీ మాధవరంలో నిర్వహించారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ ఎంతో పొదుపుగా మాట్లాడారు. ఎందుకంటే మొత్తం ఇప్పుడు మాట్లాడేస్తే ఇక ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే ప్రీరిలీజ్ వేడుకలకి కూడా మేటర్ ఉండదు కదా..!.
ఇక ఈ వేడుకలో అల్లుఅర్జున్ మొత్తంగా ఓ పదినిమిషాలు మాట్లాడగా, అందులో ఐదు నిమిషాలు పవన్ గురించే మాట్లాడటం విశేషం. ఈయన ఈ ఐదు నిమిషాలలో 'ఏసీ రూముల్లో హాయిగా సాగే జీవితాన్ని, కోట్లాది రూపాయల డబ్బును కాదని పవన్‌కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారు. పవన్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సహజమే. ఎన్నో ఏళ్ల కిందట ప్రజారాజ్యం సమయంలోనే చిరంజీవి గారి మీద కూడా ఇలాంటివి రావడంతో నాటి నుంచి మనసు మొద్దుబారి పోయింది. ఇప్పుడు పవన్ వచ్చాడు కాబట్టి తమకి చానెల్ ఉంది కదా.. అని ఎవరెవరో మాట్లాడుతున్నారు. మన ఖర్మ అన్నప్పుడు ఆయనకు మంచి స్పందన లభించింది. ఏదో మాట్లాడుతున్నారు గానీ మొన్న పర్సనల్‌గా మాట్లాడారు.. మాట్లాడించారు. అది చాలా తప్పు. అది నాకు నచ్చలేదు. వెలిగించింది అగ్గిపుల్లే అయినా తప్పంతా ఆయిల్ ట్యాంకర్‌ది. అది మొత్తం సర్వనాశనం చేస్తోందని బన్నీ అన్నాడు.
ఇది తనకు నచ్చలేదని చెప్పిన బన్నీ చాలా కాలం తర్వాత అందునా 'చెప్పను బ్రదర్' తర్వాత పవన్ గురించి ఇంత స్పెషల్‌గా మాట్లాడటం చూస్తే ఈ వివాదం మెగా ఫ్యామిలీకి మంచే చేసిందని, అందరినీ ఒకచోటికి చేర్చిందని, దాని ప్రభావం ఎంతో పాజిటివ్‌గా 'నా పేరు సూర్య' మీద కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని బన్నీ చెప్పడం గమనార్హం.