రచయితగా వక్కంతం వంశీ నేటి జనరేషన్‌కి తెలుసు. కానీ ఆయన మొదట ఈటీవీ న్యూస్‌కి రీడర్. తర్వాత దాసరి దర్శకత్వంలో వక్కంతం వంశీ, సుమలు కలిసి 'కళ్యాణ ప్రాప్తిరస్తు' అనే చిత్రం కూడా చేశారు. ఇక ఆ తర్వాత వక్కంతం రచయిత అవతారం ఎత్తాడు. 'కిక్, టెంపర్, రేసుగుర్రం, అతిథి, అశోక్, ఊసరవెల్లి' వంటి చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఈయనకు ఎన్టీఆర్ దర్శకత్వం చాన్స్ ఇస్తానని చెప్పి చాలా ఏళ్లు వెయిట్ చేసేలా చేశాడు గానీ ఆయనను నమ్మి దర్శకత్వ బాధ్యతలను మాత్రం అప్పగించలేదు. దాంతో ఆయన బన్నీ వద్దకు వెళ్లి దేశభక్తి కంటెంట్‌తో, కోపం, ఆవేశం మిళితమై ఉండే ఆర్మీఆఫీసర్‌గా ఉండే కథను చెప్పాడు. కనీసం ఇప్పటి వరకు సెల్‌ఫోన్ కెమెరాలో కూడా ఒక్క షాట్ కూడా తీయని వక్కంతం వంశీని నమ్మి అల్లుఅర్జున్ ఆయనకు దర్శకునిగా చాన్స్ ఇచ్చాడు.
ఇక బన్నీ పరిచయం చేస్తోన్న రెండో దర్శకుడు వక్కంతం వంశీ. ఇంతకు ముందు ఆయన 'ఆర్య' ద్వారా సుకుమార్ అనే జీనియస్‌ని పరిచయం చేశాడు. అలాగే వక్కంతం వంశీ కూడా సుకుమార్ స్థాయిలో ఎదుగుతాడని సెంటిమెంట్‌గా ఫీలవుతున్నాడు. దర్శకుడు కావాలనే నా మూడున్నరేళ్ల కలను బన్నీ నమ్మి, నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన బన్నీకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. తనని నమ్మి భారీ బడ్జెట్ పెట్టిన లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీవాస్‌లపై వక్కంతం ప్రశంసల జల్లుకురిపించాడు. సంగీత దర్శకులైన విశాల్-శేఖర్‌లు ఈ చిత్రాన్ని ఓ తెలుగు చిత్రంగా భావించకుండా, ఓ ఇండియన్ చిత్రంగా భావించి అద్భుతమైన సంగీతం ఇచ్చారని ఆయన కొనియాడారు.
ఇక ఈమధ్య వరుసగా వచ్చిన 'రంగస్థలం' ఎక్కువ నిడివితో వచ్చినా హిట్టయింది. ఇక 'రంగస్థలం' ఇచ్చిన భరోసాతో మహేష్ కూడా దాదాపు మూడు గంటల చిత్రంతో వచ్చి సినిమా కంటెంట్‌లో దమ్ముంటే నిడివి సమస్య కాదని నిరూపించాడు. ఇప్పుడు బన్నీ-వక్కంతం వంశీలు కూడా అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రం కూడా రెండు గంటల 47 నిమిషాలకు లాక్ అయింది. ఇక ఇందులో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.