తెలుగులో ఫిల్మ్‌చాంబర్, మా అసోసియేషన్, నిర్మాతల మండలి వంటివన్నీ కేవలం అవకాశాలు లేని, సినిమాలు తీయని వారిచేతిలో ఉండిపోతున్నాయి. వారు సినిమాలలో నటించడం, చిత్రాలను తీయడం చేయకపోతుండటంతో ప్రాక్టికల్‌గా వచ్చేసమస్యలపై వారి నాయకులకు అవగాహన ఉండటం లేదు. గత కొన్నేళ్లుగా చూసుకుంటే అదే భరద్వాజ, సి.కల్యాణ్, ఓ. కళ్యాణ్, సీనియర్ నరేష్ నుంచి శివాజీరాజా వరకు అందరూ ఈ తరహా వారే. తమిళనాడు తరహాలోలాగా సినిమాలలో నటిస్తూ, నిర్మిస్తున్న విశాల్ వంటి వారిలా మన ఈ యూనియన్లలో కొత్తరక్తాన్ని ఎక్కించలేకపోతున్నారు. దీంతో ఇప్పటివరకు మా స్థాపితం అయిన 25ఏళ్లు గడిచినా ఎక్కడి సమస్యలు అక్కడే. ఏదో ప్రభాకర్‌రెడ్డి వంటి వారి పుణ్యాన చిత్రపురి కాలనీ వంటివి కాస్త ఫర్వాలేదనిపించుకున్నాయి.
ఇక దాసరి ఉన్న కాలంలో కనీసం సినీ పెద్దగా, తగవులు తీర్చేందుకైనా ఓ పెద్ద మనిషి ఉండేవాడు. ఆయన మరణం తర్వాత అలాంటి వారు ఎవ్వరూ కనిపించడం లేదు. చిన్నసినిమాలకు అన్యాయం. థియేటర్లలో ఆక్రమిత ధోరణి, ఆ.. నలుగురు.. ఐదుగురి చేతిలోనే థియేటర్లు ఉండిపోతున్నాయి. ఇక ఈ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేవారే లేరు. పైరసీ సమస్య నుంచి ఏ విషయంలోనూ మన యూనియన్లు గర్వంగా ఫలానా పని చేశామని చెప్పుకోలేకపోతున్నాయి. ఇక ఎంత సేపటికి ఏదైనా ఈ యూనియన్లపై విమర్శలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం పోయి, ఆ విమర్శలు చేసిన వారి మీద చర్యల వంటివి తీసుకుంటూ నియంతృత్వ పోకడలు పోతున్నారు.
ఇక 'మా' అసోసియేషన్‌కి సంబంధించిన 25ఏళ్లు అయినా సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను అమెరికాలోని డల్లాస్‌లు చేయనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ వేడుకలకు తనతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని, ఈ వేడుకలో అందరిని ప్రత్యక్ష్యంగా కలవడం ఆనందంగా ఉందని తెలుపుతూ, అందరికీ చిరు ఆహ్వానం పలికాడు. ఇక 'మా' మరిన్ని మైలురాళ్లు దాటి భారతీయ సినీ చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానని, ప్రేక్షకుల ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని, ఈనెల 27, 28 తేదీలో డల్లాస్‌లో ఈ వేడుకలు జరుగుతాయని తెలిపాడు. ఒకవైపు శ్రీరెడ్డి వంటి వారు 'మా' పరువును ఎండగడుతుంటే. తమకేమీ పట్టనట్టు, ఆమె విషయంలో మాట కూడా మాట్లాడని పెద్దలు తమ తప్పొప్పులను సరిదిద్దుకోకుండా, శ్రీరెడ్డి వంటి వారి విషయంలో నోరెత్తకుండా పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు ప్రవర్తిస్తుండటం నిజంగా దురదృష్టకరమనే చెప్పాలి..!