ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగస్థలం' హవా ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. గత రెండు వారాల నుండి కలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తున్న రామ్ చరణ్ మూడో వారంలోను దూసుకుపోతున్నాడు. ఇక మూడో వారం ముగిసే సరికి రామ్ చరణ్ హవాకి బ్రేక్ వేసేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు యంగ్ సీఎంగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' మీద భారీ అంచనాలున్నాయి. వచ్చే వారం విడుదల కాబోయే 'భరత్ అనే నేను' విడుదలకు ముందే సంచలనాలకు తెరతీసింది. ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టించేస్తుంది.
'భరత్ అనే నేను' ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నట్టుగా చిత్ర బృందం పేర్కొంది. అలాగే అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్యకు మించి ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కూడా తెలిపింది. యుఎస్ లో మహేష్ బాబు సినిమాలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న కారణంగా.. అక్కడ అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అక్కడ మొత్తం 1000 థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతుందని తెలిపింది. మరి రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి ద కంక్లూజన్' కి సమానమైన థియేటర్స్ లో భరత్ అనే నేను విడుదల కానుంది.
భరత్ కి హిట్ గాని యావరేజ్ టాక్ గాని వస్తేనే ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపుగా 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి కేవలం ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు. కేవలం ఓవర్సీస్ లోనే కాదు.. ఇండియాలోనూ భరత్ బుకింగ్స్ మొదలైపోయాయి.