సీనియర్ నటుడు బెనర్జీ తండ్రి, నటుడు రాఘవయ్య (86) ఈ రోజు ఉదయం గుండె సంబంధిత వ్యాధి తో మృతి చెందారు. ఆయనకు ఓ కొడుకు, కుమార్తె. నటవారసుడు బెనర్జీ టాలీవుడ్‌లో దశాబ్ధాలుగా కెరీర్‌ని సాగిస్తున్నారు. కుమార్తె ప్రస్తుతం చెన్నయ్‌లోనే స్థిరపడ్డారు. నేటి (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు మద్రాస్- మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేయనున్నారు. రాఘవయ్య దాదాపు 50 ఏళ్లుగా పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. మద్రాసులో వేళ్లూనుకున్న తెలుగు సినిమా, అట్నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన క్రమంలోనూ సినీరంగంలో నటుడిగా కొనసాగారు. 'బ్రహ్మచారి' అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన.. వందలాది చిత్రాల్లో నటించారు.
ఇటీవలి కాలంలో వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల చిత్రాల్లో నటించారు. ఈనెల 20న రిలీజవుతున్న మహేష్ 'భరత్ అనే నేను' చిత్రంలోనూ ఆయన ఓ పాత్రలో నటించారు. బెనర్జీ ప్రస్తుతం 'మా' అసోసియేషన్‌లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణవార్త విన్న అనంతరం 'మా' బృందం తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.