నిజానికి 'రంగస్థలం' అద్భుతమైన చిత్రమే కావచ్చు. ఇటీవలి కాలంలో ఓ స్టార్ హీరో ఇలాంటి చిత్రం చేయడం సాహసమే అయి ఉండవచ్చు. అయితే 'రంగస్థలం' కథ, కథనాలు గొప్ప ప్రయోగాలుగా మనం చెప్పలేం. ఇవి సాదాసీదాగా ఉన్నాయి. కానీ సుకుమార్ తనదైన మ్యాజిక్ చేసి సినిమాలో నటీనటులు కనిపించకుండా పాత్రలే కనిపించేలా చేశాడు. ఇక పవన్ సినిమాలు చూసేది తక్కువ కాబట్టి ఆయనకు ఈచిత్రం అంత గొప్పగా ఉండవచ్చు. కానీ తెలుగులో ఇటీవల చిన్నహీరోల చిత్రాలు కూడా ఎంతో వైవిధ్యభరితంగా వస్తున్నాయి. బహుశా పవన్‌కి ఆ విషయం తెలియదేమో అనుకోవాలి. ఇక 'రంగస్థలం'కి జాతీయ అవార్డులను పొందే అర్హత అయితే మాత్రం ఉంది. కానీ పవన్ మాత్రం దీనిని ఏకంగా ఆస్కార్‌కి పంపాలని కోరుతున్నాడు.
ఈ చిత్రం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, నాడు 'దంగల్' గురించి నేను ట్వీట్ చేశాను. ఆ చిత్రం కూడా ఓ భారతీయ కథ. ఇక ఇప్పుడు 'రంగస్థలం' గురించి చెబుతున్నాను. ఈ చిత్రం మనకథ, మనమట్టి కథ, మన తెలుగు నేల కథ, మనం యాక్షన్, రొమాంటిక్, మన పౌరుషాలు, పట్టింపులు, మన గొడవలు అన్నిఇందులో సహజంగా ఉన్నాయి. రామ్‌చరణ్ సత్తా ఉన్న నటుడు. 'రంగస్థలం' ఆస్కార్‌కి వెళ్లాల్సిన సినిమా. దక్షిణభారతం, ఉత్తరభారతం కలిసి ఓ లాబీగా ఏర్పడి ఇలాంటి గొప్ప చిత్రాన్ని'ఆస్కార్'కి షార్ట్ లిస్ట్ చేసి లాస్ ఏంజెల్స్‌కి పంపాలి. అలా చేయకపోతే మనం ద్రోహం చేసిన వారిమి అవుతాం. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్నిఅంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తే భారతీయ సినిమాకి మేలు జరుగుతుంది.
నా నుంచి ఎలాంటి అండ దండలు కావాలన్నా ఉంటాయి. రెండేళ్ల కిందట 'బాహుబలి' కోసం అందరు ఎలాగైతే అండగా నిలబడ్డారో...'రంగస్థలం' విషయంలో కూడా అందరు అండగా నిలబడాలి. రాజకీయ పరంగా తెలుగు చిత్ర సీమ మాత్రం ఒక్కటే అని చెప్పుకొచ్చాడు. కానీ ఈ చిత్రం తెలుగు వారికి కొత్తేమో గానీ కోలీవుడ్‌లో ఇలాంటి 'రా' చిత్రాలలో బాల నుంచి ఎందరో దర్శకులు నిష్ణాతులై ఎన్నోఅద్భుత కళా ఖండాలని తీసిన విషయం విస్మరించరాదు. ఈ పొగడ్తలలో పవన్ కాస్త అత్యుత్సాహం చూపించాడనే అర్ధమవుతోంది...!