ప్రస్తుతం ఎవరి నోట విన్నా కూడా 'రంగస్థలం' గురించే. ఈ చిత్రం సాధిస్తున్న విజయకేతనంలో యూనిట్ అంతా మునిగిపోతున్నారు. ఇప్పటికే మహేష్, పవన్, ఎన్టీఆర్, రాజమౌళి, వర్మ వంటి వారి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని తాజాగా నాగార్జున కూడా ఆకాశానికి ఎత్తేశాడు. ఇక సుకుమార్ తదుపరి చిత్రం ఏమిటి? అనే విషయంలో పలు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీమేకర్స్ బేనర్‌లోనే మహేష్, తర్వాత చిరంజీవిలతో ఆయన సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ఆమద్య సుకుమార్ దర్శకత్వంలో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నాడని అఫీషియల్‌గానే అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ ఈ చిత్రం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
దాంతో దేవిశ్రీ ప్రసాద్‌తో చిత్రం గురించి సుకుమార్ మాట్లాడుతూ, దేవిశ్రీ ప్రసాద్ ఫొటో జెనిక్ ఫేస్, ఆయనలోని ఎనర్జీని చూసి ఆయన హీరోగా ఓ చిత్రం చేయాలని భావించాను. పూర్తిగా హీరోగా వద్దు. ఈ ఒక్క చిత్రం చేసి పదిలంగా చూసుకోమని చెప్పాను. కానీ ఇప్పటివరకు అది వర్కౌట్ కాలేదు. ఆలస్యం అవుతూనే ఉంది... అని చెప్పాడు. ఇక సుకుమార్‌కు దేవిశ్రీకి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. సుకుమార్ చిత్రాలకు దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్స్ ఇస్తాడు. ముఖ్యంగా ఐటం సాంగ్స్‌ని అయితే ఓ ఊపు ఊపుతాడు. ఆ కోవలోకే 'అ.. అంటే అమలాపురం' నుంచి తాజాగా 'జిగేల్‌రాణి' వరకు గమనించవచ్చు. ఇక సుకుమార్ తాను దర్శకుడినిగా ఎలా మారాడో చెప్పుకొచ్చాడు.
'దిల్' చిత్రం సమయంలో వినాయక్ ద్వారా నాకు దిల్‌రాజు పరిచయం అయ్యాడు. వినాయక్ చెప్పిన మాటలను బట్టి నన్ను దర్శకునిగా పరిచయం చేయాలని దిల్‌రాజు భావించారు. అప్పటికే ఆయన ఓ తమిళ సూపర్‌హిట్ చిత్రం రీమేక్ రైట్స్‌ని కొని ఉన్నాడు ఆయన ఆ చిత్రాన్ని నాతో చేయాలనిపించి, స్క్రిప్ట్‌ని నా ముందుంచారు. నేను కూడా అదే రీతిలో ఆయన వద్దకు స్క్రిప్ట్‌ని పెట్టాను. ఆయన ఆశ్చర్యంగా నా వైపు చూశారు. రీమేక్ చేయనని చెప్పేశాను. దాంతో తొలి అవకాశం వదులుకోవద్దని కోడైరెక్టర్ సూచించాడు. అవసరమైతే మరలా వెళ్లి లెక్కల ట్యూషన్ అయినా చెప్పుకుంటాను గానీ రీమేక్ చేయనని చెప్పాను. అప్పుడు దిల్‌రాజు నా మనసులోని విషయాన్ని గ్రహించడంతో 'ఆర్య'తో నా మొదటి చిత్రం ప్రారంభమైంది.. అని తెలిపాడు.