మన సినీ జనాలు, మరీ ముఖ్యంగా ప్రేక్షకులు భావించేది ఏమిటంటే.. సినిమాలలో కనిపించినట్లే నిజజీవితంలో కూడా అందరు అలాగే ఉంటారని భావించడం. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. గయ్యాళిపాత్రలకు సూర్యకాంతం పెట్టింది పేరు. కానీ నిజజీవితంలో మాత్రం ఆమె ఎంతో సున్నిత మనస్కురాలు. తాను ఇంట్లో ఏది వండినా కూడా వచ్చి యూనిట్‌లోని అందరికీ పెట్టందే ఆమెకి నిద్ర పట్టేది కాదు. ఇక వ్యాంప్ తరహా పాత్రలు చేసేవారు కూడా నిజజీవితంలో అలా ఉంటారని అనుకోకూడదు. ఈ విషయంలో జయమాలిని గురించి చెప్పాలి. కుటుంబ పోషణ కోసం క్లాసిక్ డ్యాన్సర్ అయిన ఆమె వ్యాంప్, క్లబ్ సాంగ్స్‌లో నటించింది. చివరకి ఆమె కూతురు కూడా తాను చదివే స్కూల్‌లో తన తల్లి ఎవరో తెలిస్తే నానా విధాలుగా అనుకుంటారని భయపడి తన తల్లి ఎవరో కూడా చెప్పేది కాదు.
ఇక నేడు హీరోయిన్లే ఇలా ఐటమ్స్‌లో చేస్తుండటంతో దీని మీదే బతికే ఎంతో మంది రోడ్డున పడుతున్నారు. ఇక నాడు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబుల హవా సాగుతున్న సమయంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నరసింహరాజు. ముఖ్యంగా ఆయనకు విఠలాచార్య చిత్రాలలో వచ్చిన అవకాశాల వల్ల ఆయన స్టార్ స్టేటస్ అనుభవించాడు. ఆయన నాటి నటీనటులు గురించి చెబుతూ.. ఎన్టీఆర్ దేవుడు. మనం దేవుడిని మొక్కుకునే సమయంలో ఆయన రూపమే గుర్తుకు వస్తుంది. ఇక ఏయన్నార్ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందంగా కనిపించడం ఎలా? అనేది చూపించారు. ఆయన చూపిన బాటలోనే శోభన్‌బాబు, మురళీమోహన్ వంటి వారు నడిచారు. ఇక చిరంజీవి గొప్ప డ్యాన్సర్, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన పలు గుప్తదానాలు చేస్తారు.
ఇక నాది, జయమాలినిది హిట్ పెయిర్. మా కాంబినేషన్‌లోవచ్చిన చిత్రం 'జగన్మోహిని'. నిజానికి జయమాలిని వంటి మహిళ భూమండలంలో ఉండదు అనిపిస్తుంది. ఆమె తాను సీన్ చేసిన తర్వాత కనీసం ఎవరి మొహం చూడటం గానీ, కళ్లలో కళ్లు పెట్టి చూడటం కానీ చేయదు. ఆమె పోషించిన పాత్రలు వేరు.. ఆమె స్వభావం వేరు. అలాంటి స్త్రీ ఇండస్ట్రీలో ఉండటం అరుదు. దీని కారణంగానే అప్పటి నుంచి ఇప్పటివరకు జయమాలినిని గురించి ఏ దర్శకనిర్మాత, హీరో చెడుగా మాట్లాడలేదు అని చెప్పుకొచ్చాడు.