వర్మ తనకు తాను వెరైటీగా, వివాదాలతో ఉండటమే కాదు.. ఎవరైనా ఇండస్ట్రీలో వివాదాలను తెచ్చుకున్నప్పుడు వెంటనే వారికి మద్దతు తెలిపి తన ఉద్దేశ్యం చెబుతాడు. ఇక ఈయన 'అర్జున్‌రెడ్డి' చిత్రం నేపధ్యంలో వి.హనుమంతరావు కిసింగ్ సీన్స్ పోస్టర్లను చింపేసినప్పుడు ఆయన ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాలకు సపోర్ట్ తెలిపి, వారి చిత్రానికి మద్దతు తెలిపి 'చిల్ తాతయ్య' అంటూ నానా రచ్చ చేశాడు. దీనిని విజయ్‌దేవరకొండ తనకు అనుకూలంగా మార్చుకుని తన యాటిట్యూడ్ తెలిపాడు. ఇక విజయ్‌దేవరకొండను తెలంగాణ పవర్‌స్టార్ అని ఏకంగా నిచ్చెన ఎక్కించాడు.
ఇక ఈయన డ్రగ్స్ విచారణ సమయంలో పూరీ, చార్మిలకు అనుకూలంగా చేసిన ట్వీట్స్, పవన్‌కళ్యాణ్, మహేష్ కత్తి వివాదంలో కూడా కత్తి మహేష్‌ని సపోర్ట్ చేశాడు. ఇక ఈయన శ్రీరెడ్డి వివాదం ద్వారా కూడా తాను వార్తల్లో నిలుస్తున్నాడు. ముంబైలో పవన్ తెలియక పోయినా శ్రీరెడ్డి అందరికీ తెలిసిందని, ఆమె నేడు నేషనల్ సెలబ్రిటీ అని పొగిడాడు. ఇక తాజాగా ఆయన వరుస ట్వీట్స్ పెడుతూ, 100ఏళ్ల సినీ చరిత్రలో కాస్టింగ్‌కౌచ్‌కి వ్యతిరేకంగా ఈస్థాయి ఉద్యమం చేసిన వారు లేరని, ఈ విషయంలో తను శ్రీరెడ్డికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపాడు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి ఆమె తల్లి గర్వపడాలి. ఆమెలా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకుని రావడానికి ఎవ్వరూ పోరాటం చేయలేదని చెప్పాడు.
ఇక ఈమె అర్ధనగ్న నిరసనను పలువురు ఇది సరైనమార్గం కాదని, వేరే మార్గంలో దీనిని తెలియజేయాల్సిందని అంటున్నవేళ వర్మ మరో అడుగు ముందుకేసి ఈమె అర్ధనగ్నంగా నిరసన చేయడంతోనే ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతాక శీర్షికలుగా వచ్చి, అందరిని మేల్కొలిపిందని, ఈ విషయంలో శ్రీరెడ్డి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని వర్మ ట్వీట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.