విభిన్న కథా చిత్రాలు, 'రా' చిత్రాలను కూడా తీసే విధంగా తెరకెక్కిస్తే సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని 'రంగస్థలం'తో నిరూపితం అయింది. ఈ చిత్రం ఇచ్చిన ఊపుతో పలువురు ఇతర స్టార్స్ కూడా వైవిధ్యభరితమైన, ప్రయోగాత్మకమైన సినిమా కథలపై మనసు పెడుతున్నారు. ఇక టాలీవుడ్ యంగ్ స్టార్స్‌లో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ఒకడు. ఈయన వరుసగా క్లాస్ చిత్రాలైన 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి'లతో పాటు 'రేసుగుర్రం, సరైనోడు, డిజె' చిత్రాల ద్వారా వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఇక ఈయనకు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాళంలో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. అలా మాలీవుడ్‌లో పాగా వేసిన తొలి తెలుగు హీరోగా ఈయన రికార్డ్సు క్రియేట్ చేశాడు.
ఇక ఈయన నటించే చిత్రాలు అనువాదాలు కూడా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి, బాలీవుడ్ శాటిలైట్, డిజిటల్ పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ మిలటరీ ఆఫీసర్‌గా దేశభక్తి నరనరాన జీర్ణించుకున్న వ్యక్తిగా కనిపించనున్నాడు. ఈ చిత్రం మే 4న విడుదల కానుండగా, లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీవాసులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక బన్నీ ఈ చిత్రంలో సిన్సియర్ మిలటరీ ఆఫీసర్ కావడంతో ఆయన చేత తనదైన స్టయిల్ వెటకారం, ఊరమాస్ సీన్స్‌ని మనం ఊహించలేం. దాంతో ఈ చిత్రంతో బన్నీ కూడా ప్రయోగం చేస్తున్నట్లే లెక్క.
ఇక అల్లుఅర్జున్ తదుపరి చిత్రాన్ని 'క్షణం' చిత్ర దర్శకుడు రవికాంత్ పేరేపుతో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ పక్కానే అయినా మరో చిత్రం తీసి రవికాంత్‌పేరేపు తన టాలెంట్‌ని మరోసారి నిరూపించుకుంటే గానీ ఈ చిత్రం పట్టాలెక్కదు. ఇలాంటిసమయంలో బన్నీ విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడట. చిత్రం టైటిల్ కూడా 'అహం బ్రహ్మస్మి' అని విభిన్నంగా ఉంటుందిట. ఇక క్రిష్ గతంలో బన్నీని చిన్న పాత్రలో చూపిస్తూ 'వేదం' చిత్రం చేశాడు. ఇక ఈయనకు కమర్షియల్ దర్శకునిగా 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో పేరొచ్చింది. కాగా ఏరికోరి నిర్మాతలు కంగనారౌనత్ నటిస్తున్న ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్ర 'మణికర్ణిక' వంటి హిస్టారికల్ మూవీని క్రిష్ చేతిలో పెట్టారు. కంగనాకి గాయం కారణంగా ఈ చిత్రం ఆలస్యమైంది. త్వరలో షూటింగ్‌ని ముగించుకుని క్రిష్ బన్నీని కలిసి స్టోరీ చెప్పనున్నాడట. విభిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సమయంలో బన్నీ మరోసారి ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి.