ప్రస్తుతం ఏ ఇద్దరు సినీ అభిమానులు, ప్రముఖుల మధ్య సంభాషణ జరిగినా అందులో 'రంగస్థలం' చిత్రం గురించి చర్చ సాగుతోంది. అంతలా ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఇక ఈ చిత్రం 'ఖైదీనెంబర్ 150' రికార్డులను కొల్లగొట్టి 'బాహుబలి-ది బిగినింగ్,, బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత మూడో స్థానాన్ని ఆక్రమించేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రం ఓవర్‌సీస్‌లో కూడా దుమ్ము రేపుతోంది. ఇక విషయానికి వస్తే సాధారణంగా తన చిత్రాలనే తాను చూసుకోనని చెప్పే రామ్‌చరణ్ బాబాయ్ , జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో వీక్షించాడు. దీనికి రామ్‌చరణ్, ఉపాసనతో పాటు దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఈ చిత్రం చూసిన తర్వాత పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ, తన 'తొలి ప్రేమ' తర్వాత థియేటర్‌కి వెళ్లి చూడాలనిపించిన చిత్రం 'రంగస్థలం'. చిత్రం అద్భుతం... రామ్‌చరణ్ నటన అత్యద్భుతంగా ఉంది. నిర్మాతలు మంచి చిత్రాన్ని తీశారు. డైరెక్టర్ సుకుమార్ రాసిన కథ ఎంతో అద్భుతంగా ఉంది. వాస్తవాలకు దగ్గరగా ఈ కథను సుకుమార్ తెరకెక్కించిన విధానం బాగుంది. నా మనసుకు బాగా నచ్చిన చిత్రం 'రంగస్థలం'. ఈ సినిమా గురించి మిగిలిన విశేషాలను సక్సెస్ మీట్‌లో చెబుతాను అని చెప్పాడు.
దీంతో పవన్ 'రంగస్థలం' విజయోత్సవ సభకు రావడం పక్కా అని తెలుస్తోంది. ఇక ఎలాగూ చిరంజీవి కూడా వస్తాడు. వీరితో పాటు ఈ వేడుకకు బన్నీ కూడా వస్తాడని సమాచారం. ఇప్పటి వరకు 'రంగస్థలం' విషయంలో ఏ వ్యాఖ్యలు చేయని బన్నీ ఓ ఇంటర్వ్యూలో మాత్రం సినిమా అద్భుతంగా ఉందని చెప్పాడు. దాంతో బన్నీ కూడా ఈ చిత్రం గురించి తాను అనుకున్న భావాలను చెప్పేందుకు 'రంగస్థలం' సక్సెస్ మీట్‌నే వేదిక చేసుకోనున్నాడు. ఇక రాజకీయాలలో బిజీగా ఉన్న పవన్ ఈ చిత్రం చూసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం, రామ్‌చరణ్‌కి అరుదైన పొగడ్తను ఇవ్వడంతో మెగాభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఇక తన మెగా ఫ్యామిలీ కాంపౌండ్ హీరోల చిత్రాల గురించి కూడా పెద్దగా స్పందించే అలవాటు లేని పవన్ 'రంగస్థలం'పై చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అనే చెప్పాలి. ఇక పవన్‌కి ఈ చిత్రం నిర్మాణ సంస్థ అయిన మైత్రిమూవీస్ బేనర్‌లో ఓ చిత్రం చేయాల్సివుంది. నిర్మాతలుగా వరుస హిట్స్‌తో మూడే మూడు చిత్రాలతో టాలీవుడ్‌లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న 'మైత్రిమూవీమేకర్స్' ఎన్నికలయిన తర్వాత అయినా ఇదే బేనర్‌లో పవన్‌తో ఓ చిత్రం చేస్తే అది బ్లాక్‌బస్టర్‌గా నిలవడం గ్యారంటీ అంటున్నారు.