నిజానికి మహేష్‌బాబు 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ వేడుకల్లో చెప్పినట్లు అటు తిప్పి, ఇటు చూస్తే ఐదారు మంది స్టార్స్ కూడా లేరు. మహా అయితే వీరు నటిస్తే ఏడాదికి ఓ చిత్రంలో నటిస్తారు. కాబట్టి అభిమానులు సమైక్యంగా ఉండి అందరి చిత్రాలను హిట్ చేయాలి. మేము మేము బాగానే ఉంటాం.. మీరు ఇంకా బావుండాలి అని మహేష్ చెప్పడం బాగా వైరల్ అయింది. ఇక 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ వేడుకకు మహేష్, కొరటాల శివలు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు రామ్‌చరణ్ కూడా ఆహ్వానించారని వార్తలు వచ్చాయి. కానీ రామ్‌చరణ్ మాత్రం హాజరుకాలేదు. మహేష్, ఎన్టీఆర్‌లు కలిసి కనిపించారు. ఇక ఈ వేడుక ముగిసిన వెంటనే మహేష్, ఎన్టీఆర్‌లు కలిసి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడ రామ్‌చరణ్ కూడా దర్శనమిచ్చాడు. ఇక మహేష్,ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు కలిసి ఫొటోలకు కూడా ఫోజులిచ్చారు. దీంతో ఘట్టమనేని, నందమూరి, మెగాభిమానులందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ పార్టీ ఎవరు ఇచ్చారు? అనేది మాత్రం తెలియడం లేదు. ఈ ఫొటోలలో మైత్రిమూవీ మేకర్స్ అదేనండీ 'రంగస్థలం' నిర్మాతలు కూడా కనిపిస్తూ ఉండటంతో ఈ పార్టీ 'రంగస్థలం' విజయానందంలో ఆ నిర్మాతలు ఇచ్చిన పార్టీ అని అంటున్నారు. ఇక ఈ వేడుకకు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, మహేష్ భార్య నమ్రతా, ఉపాసన ఫ్రెండ్ అయిన దియా మెహతా భూపాల్ కూడా హాజరయ్యారు. ఉపాసన, నమ్రతా, దియా మెహతా భూపాల్ కలిసి ఉన్నఫోటోలని ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్ ఉన్న ఫొటోని కూడా పెట్టింది. నమ్రతా, దియాలతో గొప్ప సమయాన్ని గడిపానని ఉపాసన తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పటికే 'రంగస్థలం' చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచి నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతూ, ఇండస్ట్రీ హిట్‌గా నిలిస్తే ఈనెల 20న మహేష్, కొరటాలల కాంబినేషన్‌లో వచ్చే 'భరత్ అనే నేను' మీద కూడా మహేష్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. గత రెండు మూడు చిత్రాలుగా మహేష్ తన ఫ్యాన్స్‌ని, సినీ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. మరి 'భరత్ అనే నేను' ఆ బాకీనంతటిని తీరుస్తుందని మహేష్‌బాబు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విషయంలో మహేష్ కూడా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈసారి అభిమానులు, ప్రేక్షకులు గర్వపడే చిత్రం చేశానని, 20వ తేదీని థియేటర్లలో కలుద్దామని ఆయన నమ్మకంగా చెబుతున్నాడు.