శివ తర్వాత రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఆఫీసర్'. ఈ చిత్రంతో రాము.. నాగ్ ని సరికొత్తగా చూపించనున్నాడు అనే టాక్ బాగా వినబడింది. ఆల్రెడీ రిలీజ్ అయిన స్టిల్స్ లో నాగార్జున హ్యాండ్సమ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నప్పటికీ లుక్ లో పెద్దగా కొట్టడం అనిపించలేదు అనే కామెంట్స్ ఉన్నాయి.
అయితే ఈ సినిమా టీజర్‌ను సోమవారం ఉదయం 10గంటలకు చిత్రబృందం రిలీజ్ చేసింది. నాగార్జున ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నప్పటికీ... కొత్తదనం మిస్ అయ్యిందనే ఫీలింగ్ మాత్రం పోలేదు. ఇక ముంబై బ్యాక్ డ్రాప్ గా కథ మొత్తం నడుస్తుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. ఓ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో నాగార్జున హైదరాబాద్ నుండి ముంబై స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా వెళ్తాడు. తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేసే దాకా వదిలిపెట్టను అని నాగ్ సీరియస్ గా చెప్పడం మాస్ కి కిక్ ఇచ్చేదే.
వర్మ సినిమాల్లో కనిపించే మాఫియా బ్యాక్ డ్రాప్ ఇందులో కూడా ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ నాగ్ క్యారెక్టరైజేషన్ మీద పెట్టడంతో అక్కినేని ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది కానీ... సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అంతగా ఎక్కేలా కనబడడం లేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఈమధ్యన కొత్తగా ఆలోచించే శక్తిని కోల్పోయాడు. అస్సలు ఫామ్ లో లేని వర్మ ఎంత మ్యాజిక్ చేస్తే ఈ సినిమా హిట్ కావాలి. మరి నాగార్జున.. రామ్ గోపాల్ వర్మ ని గుడ్డిగా నమ్మి మోసపోతాడనే టాక్ ఉండనే ఉంది. ఇక ఈ ఆఫీసర్ టీజర్ మొత్తంలో తెలుగు నటుల్లో అజయ్ మాత్రమే కనిపించాడు. ఆఫీసర్ కథ మొత్తం ముంబై బ్యాక్ డ్రాప్ లో ఉంది కాబట్టి... నటీనటులు మొత్తం అక్కడి సెటప్ లాగే కనిపిస్తోంది. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అని అర్ధం అవుతుంది. హీరోయిన్ మైరా సరీన్ ను గ్లామర్ పరంగా చూపించకుండా చేజింగ్ లో గన్నులు పేలుస్తూ చూపించడం కూడా అంతగా నచ్చేలా లేదు. మరి ఈ సినిమాతో వర్మ ఈజ్ బ్యాక్ అంటాడా... లేదంటే రొటీన్ వర్మ అంటాడా అనేది మే 25న తేలనుంది.