మహేష్‌బాబు 'స్పైడర్',ఎన్టీఆర్ నటించిన 'జైలవకుశ' చిత్రాలు రెండు తక్కువ గ్యాప్‌లోనే విడుదలయ్యాయి. 'జైలవకుశ' హిట్ కాగా, 'స్పైడర్' చిత్రం ఫైనాన్షియల్‌గా నిరాశ పరిచింది. దీంతో మహేష్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని ఎన్టీఆర్ అభిమానులు ట్రాల్ చేశారు. అయినా తామిద్దరం సినిమాలలో పోటీ పడినా, వ్యక్తిగతంలో ఎంతో కావాల్సిన వారిమనే సంకేతాలు ఇచ్చేందుకే 'భరత్ అనే నేను' ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్‌ని గెస్ట్‌గా పిలిచారని అర్ధమవుతోంది. ఇక ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు మనవడినైన నేను...అభిమాన సోదరులందరికీ నమస్కారాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. మీరందరు మహేష్‌ని ప్రిన్స్, సూపర్‌స్టార్ అని పిలుస్తూ ఉంటారు. నేను మాత్రం మహేష్‌ని అన్నయ్య అని పిలుస్తుంటాను. ఈవేడుకకు నేను అతిధిగా రాలేదు. ఓ కుటుంబ సభ్యునిగా వచ్చాను. కమర్షియల్ హీరోగా మహేష్‌బాబు చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలు మేమెవ్వరం చేయలేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. 'భరత్ అనే నేను' చిత్రం రికార్డులను తిరగరాయాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం మహేష్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలవాలని ఆశిస్తున్నాను. సమాజం పట్ల ఎంతో బాధ్యత కలిగిన దర్శకుడు కొరటాల శివ, అభిమానులకు కావాల్సిన మసాలాలు బాగా దట్టించి, తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని ఆయన అందిస్తారు.. అని చెప్పాడు.
ఇక మహేష్‌బాబు మాట్లాడుతూ.. కృష్ణగారబ్బాయి అనే నేను అంటూ దీనిని తమ్ముడు తారక్ నుంచి నేర్చుకున్నాను. 'ఆది' సినిమా వేడుకకు నేను వెళ్లాను. ఇప్పుడు ఎన్టీఆర్ నా సినిమా వేడుకకు వచ్చారు. ఇక నుంచి ఫంక్షన్ల ట్రెండ్ మారుతుంది. అందరు హీరోలు అందరి ఫంక్షన్లకు వెళ్తారు. మేము మేము బాగానే ఉంటాం. మీరే ఇంకా బాగా ఉండాలి. ఈ సినిమాలో నా పాత్ర సీఎం అని చెప్పగానే నాకు వణుకు వచ్చింది. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేశాను. నాకెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన చిత్రంగా దీనిని చెప్పాలి. ఈనెల 20 వతేదీన మా అమ్మగారైన ఇందిరాదేవి పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు, దీవెనలను మించి ఏమీ ఉండవంటారు. ఆరోజునే నా చిత్రం విడుదల కానుండటం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపాడు.
ఇక దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ఇద్దరు హీరోల అభిమానులను ఇలా ఒకే చోట చూడటం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఏ సినిమా చేస్తానో ఆ హీరోకి పెద్ద ఫ్యాన్‌ని అయిపోతాను. నన్ను మించిన అభిమాని ఉండరు. ఈ చిత్రం విజువల్‌గా ఎంత బాగుంటుందో అభిమానులందరూ కలసి కూర్చుంటే అంత ఆనందంగా ఉంది. ఒకే వేదికపై మహేష్, ఎన్టీఆర్‌లు కనిపిస్తారని తెలిసి యూఎస్ నుంచి ఈ వేడుకకు వస్తామని పలువురు కాల్స్ చేశారు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి రాబోయే కాలంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల చిత్రం వల్ల ఆ ఇద్దరు హీరోల అభిమానులు, ఈ చిత్రం వేడుక వల్ల ఘట్టమనేని, నందమూరి అభిమానులు ఏకం కావడం ఆనందించదగ్గ విషయం.