గురు శిష్యుల మధ్య పోటీ అంటే బాగా ఆసక్తికరంగా ఉంటుందనే చెప్పాలి. అందునా ఆ గురువుకి శిష్యుడు అందరిలోకి మరీ మరీ ఇష్టం. వారే రాంగోపాల్‌వర్మ, పూరీజగన్నాథ్‌లు, వర్మ ఎవరినైనా విమర్శిస్తాడు గానీ పూరి మీద మాట పడినా ఒప్పుకోడు. ఆయన డ్రగ్స్‌కేసులో ఉన్నప్పుడు వర్మ రెచ్చిపోయాడు. ఇక పూరీ తీసిన చిత్రాల టీజర్లు, ఇంపాక్ట్‌లు, స్టంపర్లు విడుదలైనప్పుడు వర్మ వాటిని ఆకాశానికి ఎత్తేస్తాడు. అయితే ఆయా చిత్రాలు విడుదలై ఫ్లాప్ అయితే మాత్రం వర్మ నెగెటివ్‌గా స్పందించకుండా మౌనాన్నేఆశ్రయిస్తాడు. వారిద్దరి మధ్య ఉన్నసాన్నిహిత్యం అలాంటిది. ఇక వర్మ అంటే ఎప్పుడో ఫామ్ కోల్పోయాడు. కేవలం ఏదో 'రక్తచరిత్ర' పార్ట్1, 'వీరప్పన్' తరహా చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. ఇక అమితాబ్ బచ్చన్ ఆయనకి ఇచ్చిన 'సర్కార్ 3' అవకాశాన్ని కూడా వర్మ సద్వినియోగం చేసుకోలేక పోయాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా నాగ్ వర్మపై నమ్మకం ఉంచి, వర్మ కంపెనీలోనే 'ఆఫీసర్' చిత్రం చేస్తున్నాడు.
ఇక ఈ చిత్రం టీజర్‌ని రేపు అంటే సోమవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని వర్మ ప్రకటించాడు. వెంటనే పూరీజగన్నాథ్ కూడా తాను తన కొడుకు ఆకాష్ పూరీ హీరోగా చేస్తున్న 'మెహబూబా' చిత్రం టీజర్‌ని కూడా ఒక గంట ముందు అంటే సోమవారం ఉదయం 9గంటలకు విడుదల చేస్తామని ప్రకటించాడు. అంటే కేవలం ఒక గంట గ్యాప్‌లో టీజర్ల ద్వారా గురు శిష్యులు పోటీ పడనున్నారు. ఇక 'మెహబూబా' చిత్రం యూత్ రొమాంటిక్‌గా, ఇండో పాక్ సరిహద్దులో జరిగే పీరియాడికల్ డ్రామాగా రూపొందగా, 'ఆఫీసర్' చిత్రం నాగార్జునలోని మరో యాక్షన్ హీరో కోణాన్నిఆవిష్కరిస్తూ, 'శివమణి' తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్ పవర్‌ని చూపించడానికి సిద్దమవుతున్నారు. ఇక మే 11న 'మెహబూబా' విడుదల కానుండగా, రెండు వారాల గ్యాప్ తర్వాత వర్మ 'ఆఫీసర్'గా నాగార్జునతో కలిసి మే 25న వస్తున్నాడు. ఈరెండు చిత్రాలు ఈ ఇద్దరు దర్శకులకు ఎంతో కీలకమైనవి. ఇక పూరీ కొడుకు భవిష్యత్తు అయితే పూర్తిగా పూరీ చేతిలోనే ఉంది. 'జ్యోతిలక్ష్మి, లోఫర్, రోగ్, ఇజం, పైసావసూల్' వంటి డిజాస్టర్స్ తర్వాత పూరీ ఈ చిత్రం చేస్తున్నాడు. మరి ఈ గురుశిష్యుల పోటీలో ఏది విజయం సాధించనుందో చూడాల్సివుంది....!