అసలే ఏపీని మోసం చేసిన మోదీ, కేంద్రంలోని బిజెపి పార్టీ అంటే ఆంధ్రులు మండిపడుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో మేము తెలంగాణకు అనుకూలం అని మన నటీనటులు పోటీ పడి మరీ చెప్పారు. మిగిలిన వారిని షూటింగ్స్ సమయంలో తెలంగాణ వాదులు ముట్టడించి, జై తెలంగాణ నినాదం ఇచ్చే వరకు ఒప్పుకోలేదు. ఇక 'జై భోలో తెలంగాణ' అని జగపతిబాబు, తెలంగాణకు మద్దతుగా ఆర్.నారాయణమూర్తి వంటి వారు సినిమాలు కూడా తీశారు. కానీ ఇప్పుడు ప్రత్యేకహోదా విషయంలో మాత్రం సినీ ప్రముఖులు నోరు విప్పడం లేదనే మాటలో వాస్తవం అయితే ఉంది. ఎక్కడ ఆంధ్రాలో ఫంక్షన్స్ చేస్తే ప్రత్యేకహోదా మీద మాట్లాడాల్సి వస్తుందో అని 'భరత్ అనే నేను'ని సూపర్‌స్టార్ మహేష్‌బాబు, 'నా పేరుసూర్య.. నా ఇల్లు ఇండియా' బన్నీ వేడుకలను హైదరాబాద్‌కి ఫిక్స్ చేసుకున్నారు. భరత్ ఎల్‌బి స్టేడియంను దత్తత తీసుకుంటే, అల్లుఅర్జున్ గచ్చిబౌలి స్టేడియాన్ని దత్తత తీసుకున్నాడు.
ఇక తన 'స్పైడర్' రిలీజ్ సమయంలో తనకు రాజకీయాలు, ఉద్యమాలు తెలియవని చెప్పే మహేష్‌బాబు తమిళనాట జల్లికట్టుపై మాత్రం స్పందించాడు. అదే ప్రత్యేకహోదా విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ నిజజీవితంలో చేతకాకపోయినా సినిమా ద్వారా రాజకీయ నాయకులు ఎలా ఉండాలో అని జనాలకు సుద్దులు చెప్పేందుకు వస్తున్నాడు. ఇక అల్లుఅర్జున్‌కి ఈమధ్య బాగా నోటి దూల ఎక్కువ అయినట్లు కనిపిస్తోంది. ఆయన 'సరైనోడు' వేడుకలో పవన్ ఫ్యాన్స్ తమ హీరోని గురించి మాట్లాడమని కోరితే మౌనంగా ఉన్నా సరిపోయే దానికి బదులు 'చెప్పను బ్రదర్' అన్నాడు. ఇక 'ఒక్క క్షణం' ఆడియో వేడుకలో అభిమానులను అవమానించాడు. ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆంధ్రులను మోసం చేసిన మోదీ తనకు స్ఫూర్తి అని, ఆయన స్ఫూర్తితోనే తాను సాగుతున్నానని ప్రకటించడం ఆంధ్రులకు పుండుపై కారం చల్లినట్లుగా ఉంది. ఇంతకీ బన్నీకి మోదీ ఎందులో స్ఫూర్తి? బన్నీ కాస్తా కన్నింగ్‌గా మారడంలోనా? లేక మాటలు మార్చి, ఊసరవెల్లి వేషాలు వేయడం లోనా? ఎదిగే దాకా చిరు, పవన్‌ల భజన చేసి ఇప్పుడు మాత్రం తనకు తానే గొప్పగా పైకి వచ్చాననే అహంభావంలోనా? దేనిలో బన్నీకి మోదీ స్తూర్తో తెలియాల్సివుంది... ఈ వ్యాఖ్యలపై ఏపీ ప్రజలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.