నాటి వాజ్‌పేయ్, అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారు ఉన్నప్పటి బిజెపి వేరు. నేడు కేంద్రంలో ఉన్న బిజెపి వేరు. బిజెపిని, ఆరెస్సెస్, విశ్వహిందుపరిషత్, శివసేన వంటి పచ్చి హిందుత్వ వాదులు కూడా మోదీ నిస్సిగ్గుగా చేస్తున్న చర్యలను చూసి ఉడికిపోతున్నారు. స్వయాన అద్వానీ లేచి ప్రధానమంత్రి పదవికి విలువనిస్తూ, ఒకప్పుడు తన శిష్యుడు, తనకి మంచి నీళ్ల నుంచి అన్ని అందించిన నరేంద్ర మోదీకి అచ్చమైన భారత సాంప్రదాయంలో రెండు చేతులు జోడించి నమస్కారం చేసినా ప్రతినమస్కారం చేయని నీచునిగా మోదీపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. నేటి మోదీ, అమిత్‌షాల ఆధ్వర్యంలో నడుస్తున్న బిజెపిని చూసి పాతతరం నేతలు కూడా తాము కోరుకుంది ఇలాంటి ప్రభుత్వం కాదని చెబుతున్నారు. చంద్రబాబును బిజెపి బాధితునిగా ఓ విలేకరి అభివర్ణిస్తే, చంద్రబాబుతో ఉన్న మురళీ మనోహర్ జోషిని మోదీ బాధితునిగా ఓ విలేకరి పేర్కొన్నప్పుడు మురళీమనోహర్ జోషి కూడా కదిలిపోయారంటే పరిస్థితి అర్ధమవుతోంది. ఇప్పటి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాటి కాంగ్రెస్ కంటే నీచాతినీచంగా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా తమకు పట్టులేని దక్షిణాది ఆదాయాన్ని భారీగా దండుకుంటూ మొత్తం ఉత్తరాదికి దోచిపెడుతోంది. తమకు సీట్లు బాగా వచ్చే రాష్ట్రాలకు అధిక మొత్తం ధనాన్ని సరఫరా చేస్తూ, దక్షిణాదిలో బ్యాంకులలో డబ్బులు లేకుండా, ఏటీఎంలు పనిచేయకుండా తన వికృతమైన చేష్టలతో ఆనందిస్తోంది. ఇన్నేళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని విధంగా ఉత్తరాది, దక్షిణాది బేధాన్ని చూపిస్తోంది.
ఇక మనదేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా తమకు పట్టున్న ప్రాంతాల కోసం ఇతరులను దగా చేస్తోంది. దీంతో దక్షిణాదిలో ఇప్పుడు బిజెపి, మోదీపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. కాంగ్రెస్ ఏపీని ముందు నుంచి పొడిస్తే, మోదీ ఏపీని వెనుక నుంచి వెన్నుపోటు పొడిచాడు. అయినా కూడా టిడిపి, వైఎస్‌ఆర్ సీపీల మధ్య గల విభేదాలను చూపించి, టిడిపి కాకపోతే వైసీపీతో కలుస్తాం.. పోతే మాకు ఏపీలో పోయేవి రెండు ఎంపీ సీట్లే కదా! అనుకుంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకి ఫేవర్ చేస్తూ కావేరి జలాల మేనేజ్‌మెంట్ బోర్డ్‌ని వేయకుండా తమిళనాడు పట్ల కసి పెంచుకుంటోంది. ఏపీ, తెలంగాణల మధ్య చిచ్చుపెడుతోంది. దీంతో దేశంలో ఇంతకాలం హిందు, నాన్ హిందు అనే తరహా బేధభావం కాస్తా ఉత్తరాది, దక్షిణాదిగా మారింది. ఇక కేంద్రంలోని బిజెపిపై ప్రముఖ దర్శకుడు, నటుడు, శింబు తండ్రి టి.రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తాడు. ఇలక్కియ డీఎంకే అధ్యక్షుడైన ఆయన కేంద్రం తమిళనాడును మోసం చేస్తోంది. రాజకీయ పార్టీలన్ని విడివిడిగా ఆందోళన చేస్తే కేంద్రాన్ని ఏమీ చేయలేం. పార్టీలన్ని కలిస్తేనే డిల్లీ మెడలు వంచగలం. బిజెపికి బుద్ది చెప్పేందుకు తమిళులందరూ సిద్దంగా ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిస్తేనే కేంద్రం మెడలు వంచవచ్చని చెప్పాడు. ఇదే విషయం ఏపీకి కూడా వర్తిస్తుంది. ఇక్కడ కూడా టిడిపి, వైసీపీలు ప్రలోభాలు, భయాలకు లొంగకుండా కలిసి పోరాడితేనే ఆంధ్రుల మనోభావాలు డిల్లీ దాకా వినిపిస్తాయి. కానీ అది జరగని పని అని చెప్పాలి.