సాధారణంగా సిని నటులు వేసే క్యారెక్టర్లు, సినిమాలలో వారు చూపే సంప్రదాయాలు, కట్టుబొట్టు వంటి వాటివల్ల ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరి పట్ల ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. సన్నిలియోన్ చేత సీత పాత్ర చేయిస్తే, అది నటనే కదా...! నటి అన్నాక అన్ని పాత్రలు చేయాలని వాదించినంత మాత్రాన ప్రేక్షకులు ఆదరించరు. ఇక నాడు సౌందర్య ఒక చిత్రంలో కొద్దిపాటి ఎక్స్‌పోజింగ్ చేస్తేనే తీవ్ర విమర్శలు వచ్చి, సినిమా ఫ్లాప్ అయింది. మరో చిత్రంలో ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తే ప్రేక్షకులు తిప్పికొట్టారు. ఇక సావిత్రి, జయసుధ, సౌందర్యల తర్వాత ఆ స్థాయిలో సంప్రదాయ బద్దంగా కనిపించే హోమ్లీ హీరోయిన్‌గా స్నేహని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం కీర్తిసురేష్, నిత్యామీనన్, సాయిపల్లవిలు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇక గోపీచంద్ హీరోగా పరిచయమైన 'తొలి వలపు' చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నాగార్జున, బాలకృష్ణ వంటి వారి సరసన సైతం రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తిరస చిత్రాల ద్వారా స్నేహ అచ్చమైన సాంప్రదాయ హీరోయిన్‌గా, బాపు బొమ్మగా కూడా పేరు తెచ్చుకుంది.
ఇక ఈమె కొంత కాలం కిందట నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. ఆమె తాజాగా మాట్లాడుతూ, అమ్మగా ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. పిల్లల గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. పిల్లల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది. ఇక ఈమధ్య ఆమె తరచుగా బుల్లితెర మీద కూడా తళుక్కుమంటోంది. తాజాగా ఆమె బోయపాటి శ్రీను,రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో రామ్‌చరణ్‌కి వదినగా, తమిళ హీరో ప్రశాంత్‌కి భార్యగా కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, నాకు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయాలని ఉంది. ప్రతినాయిక పాత్రలో మెప్పించాలని ఉంది అంటూ తన అంతరంగాన్ని బయటపెట్టింది. మరి ఎవరైనా ఆమెకు అలాంటి చాన్స్ ఇస్తారా? ఇచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారా? అనేది వేచిచూడాల్సివుంది...!