బతికిలేని రాణి పద్మావతి మీద సినిమా తీస్తేనే అందులో ఏముందో కూడా చూసుకోకుండా కర్ణిసేన కార్యకర్తలు, రాజ్‌పుత్ వర్గానికి చెందిన వారు నానా రచ్చ చేశారు. ఇప్పుడు తాజాగా 2004 నుంచి 2014 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయనకు 2004 నుంచి 2008 వరకు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు 'దియాక్సిడెంట్ ప్రైమ్‌మినిస్టర్' అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆధారంగా విజయ్‌గూట్టే అదే పేరుతో చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో మన్మోహన్ సింగ్‌గా అనుపమ్ ఖేర్ నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఈలుక్‌లో అనుపమ్‌ఖేర్ అచ్చు మన్మోహన్ సింగ్‌లా కనిపిస్తుండటం విశేషం. ఇక మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రను తీయాలంటే కొంత కాల్పనికత కూడా అవసరం. అదేదో పుస్తకం ఆధారంగా తీస్తే ఓ డాక్యుమెంటరీ అవుతుందే గానీ కమర్షియల్ మూవీ కాలేదు.
ఇక మన్మోహన్ సింగ్ విషయాన్ని తెరకెక్కించాలంటే అందులో పివి నరసింహారావు, సోనియాగాంధీ, అద్వాని, వాజ్‌పేయ్ వంటి వ్యక్తులను కూడా చూపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆయనను ఆర్ధిక మంత్రిగా నియమించి సాహసం చేసిన పివి నరసింహారావు గురించి తప్పక ప్రస్తావన ఉండి తీరుతుంది. మరి దీనిని వివాదాలకు అతీతంగా ఎలా చిత్రీకరించారో చూడాల్సివుంది. ఇక డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫస్ట్‌లుక్‌ని షేర్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అనుపమ్‌ఖేర్ అంటున్నాడు. ఈ చిత్రాన్నిఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల చేయనున్నారు. మొత్తానికి దేశ రాజకీయాలలో కీలకమైన మరో ప్రధాన మంత్రి జీవిత చరిత్రను ప్రేక్షకులకు తెలిసేలా రూపొందించడం గర్వించదగ్గ విషయమే అవుతుంది. ఈచిత్రం కనుక హిట్ అయితే మోదీ, అబ్దుల్‌కలాం వంటి వారి జీవితాలను కూడా చిత్రాలుగా తీయడానికి పలువురు సన్నాహాలు ప్రారంభించారు.