సినీ ప్రముఖులకు కూడా ఫేవరేట్ నటీనటులు, టెక్నీషియన్స్ ఉంటారు. అలా పాప్ గాయని, ప్రపంచంలోని కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన జెన్నిఫర్ లోపెజ్ అంటే మన శ్రీనువైట్లకి కూడా చాలా పిచ్చి అభిమానమట. ఇక ఇప్పుడు వరుస ఫ్లాప్‌లో ఉన్న శ్రీనువైట్ల మైత్రి మూవీ మేకర్స్‌పై 'రంగస్థలం, సవ్యసాచి' తర్వాత రవితేజతో 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం తీస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ అత్యధిక భాగం అమెరికాలో షూట్ చేసుకుంటుందని, ఇంత ఎక్కువగా అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్న చిత్రంగా ఇది రికార్డ్‌ని సృష్టించనుందని ఇప్పటికే శ్రీనువైట్ల చెప్పాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ని కూడా అమెరికాలో ప్రారంభించారు. రవితేజ ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణతో 'నేలటిక్కెట్' మూవీలో బిజీగా ఉన్నందు వల్ల ఆయన లేని సన్నివేశాలను అమెరికాలోని న్యూయార్క్ వద్ద గల జెన్నిఫర్ లోపెజ్ నివసించిన ఇంటిలో షూటింగ్ జరుపుతున్నారు. ఇక 'నేల టిక్కెట్' పూర్తి చేసిన తర్వాత రవితేజ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు.
తాజాగా న్యూయార్క్‌లోని జెన్నిఫర్ లోపెజ్ బంగ్లా వద్ద శ్రీనువైట్ల తిరుగుతూ, నేను జెన్నిఫర్ లోపేజ్‌కి క్రేజీయెస్ట్ ఫ్యాన్‌ని. కొన్నికోట్ల హృదయాలను కొల్లగొట్టిన ది ఎవర్ గ్రీన్ క్వీన్ ఆఫ్ పాప్. ఇక లాంగ్ ఐలెండ్‌లోని ఆమెకి చెందిన ప్యాలస్‌లో నా సినిమా షూటింగ్ జరుగుతుండటంతో నాకలలు నిజమయ్యాయి. మైబిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్. అంటూ ఆ భవనం ముందు నడుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మొత్తానికి ఈమె ఇప్పుడు ఆ ప్యాలెస్‌లో ఉండటం లేదు. దానిని ప్రస్తుతానికి ఆమె షూటింగ్‌లకు ఇస్తోంది. ఈ భవంతికి చాలా మొత్తం వెచ్చించి అక్కడ షూటింగ్ జరిగేందుకు శ్రీనువైట్ల పర్మిషన్ తీసుకున్నాడట. ఈయన 'మిస్టర్' సమయంలో కూడా కథ కంటే ఇలాంటి వాటికే ఎక్కువ ప్రచారం ఇచ్చాడు. దాంతో ఆ చిత్రం ఫలితం అందరికీ తెలిసిందే. అయినా కంటెంట్‌లో దమ్ముండాలే గానీ పూరి గుడిసెలోనో, లేక పూర్తి గ్రామీణ నేపధ్యంలో, విదేశాలలో తీసినా సినిమాలు హిట్ అవుతాయని 'అర్జున్‌రెడ్డి, రంగస్థలం, భాగమతి, తొలి ప్రేమ' వంటివి నిరూపించాయి. మరి శ్రీను ఇలాంటి పైపై హంగులకు ఆరాట పడకుండా మంచి కంటెంట్‌ని నమ్ముకోవాలి. ఇక ఇందులో సునీల్ కూడా ఓ కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.