ప్రస్తుతం ఎన్టీఆర్ అనే బయోపిక్‌కి బాలయ్య తేజ ద్వారా తెరరూపం ఇవ్వనుండటం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ జీవిత గాధ అంటే దానిలో ఎన్నో అంశాలు. పాలుపోసే వ్యక్తి, సబ్‌రిజిష్ట్రార్ ఉద్యోగం సంపాదించడం, తర్వాత సినిమా నటునిగా మారడం, ఆ తర్వాత స్టార్ స్టేటస్, రాజకీయ ప్రవేశం. అందులో నాదండ్ల వంటి వారి వెన్నుపోటు, భార్య అకాల మరణం, తదనంతరం రెండో వివాహం ఇలా ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. వీటన్నింటిని కేవలం రెండు గంటల్లో చూపించడం అంటే అది జరగని పని. ఈ విషయాన్ని తేజనే ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తీయాలంటే.. ఆయన జీవితంలోని అంశాలను, కీలక ఘట్టాలనే చూపించినా ఆరు గంటలకు పైగా నిడివి ఉండాల్సి వుంటుందని తేజ అన్నాడు. ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది. ఇక దీంతో తేజ 'బాహుబలి' రూట్‌ని ఎంచుకున్నాడని సమాచారం. 'బాహుబలి' చిత్రాన్ని కూడా మొదట రాజమౌళి కేవలం ఒకే పార్ట్ అనుకున్నాడు.
కానీ సినిమాలో పాత్రల సంఖ్య ఎక్కువ కావడం, ప్రతి పాత్ర హైలైట్ కావడం, కట్టప్ప బాహుబలిని చంపడం, ఇతర ప్రధాన పాత్రల ద్వారా తాననుకున్న స్టోరీని రెండు భాగాలుగా తీసి విజయం సాధించాడు. అలాగని ఆయన అనుకున్నదంతా మూడు నాలుగు గంటలు ఒకేసారి ఒకే భాగంలో చూపితే చూసే వారు ఉండరు. కాబట్టే ఆయన ఎంతో తెలివిగా తాను తీసిన ప్రతి సీన్, తాననుకున్న ప్రతి పాత్ర గొప్పదనాన్ని చూపిస్తూ రెండు భాగాలుగా విభజించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కూడా తేజ భారీ స్క్రిప్ట్‌నే తయారు చేశాడట. ఇదంతా ఒకే పార్ట్‌లో చూపించే అవకాశం లేకపోవడంతో బాలయ్యని ఓకే అనిపించి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడదీసి, మంచి ట్విస్ట్‌తో మొదటి భాగం క్లోజ్ చేయడానికి సిద్దమవుతున్నాడని తెలుస్తోంది. అందునా ఎన్టీఆర్ బయోపిక్ అనే కాదు.. ఏ బయోపిక్ అయినా కాస్త నాటకీయత, కమర్షియల్ టచ్ ఇస్తూనే అన్ని విషయాలను స్పృశించందే అది పరిపూర్ణత సంతరించుకోదు. ఎన్టీఆర్ పుట్టుక, బాల్యం, చదువు, నటుడు, స్టార్.. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాదెండ్ల భాస్కర్‌రావు, లక్ష్మీపార్వతి, ఇందిరాగాంధీల వరకు ఆయన చరిత్రను చూపించాలంటే ఇదే ఫార్ములా అయితేనే వర్కౌట్ అవుతుందని అందరు భావిస్తున్నారు.