సుకుమార్ తన ప్రతి చిత్రంలో ప్రేక్షకుల ఐక్యూకి టెస్ట్ పెడతాడని, లెక్కల మాష్టారుగా తనకున్న తెలివిని సినిమాలలో చూపించే ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనిపించుకోవాలనే తపన ఆయనలో అధికమని మొదటి నుంచి సుకుమార్ విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. 'ఆర్య, జగడం, 100%లవ్, ఆర్య2, నాన్నకు ప్రేమతో' మరీ ముఖ్యంగా మహేష్‌తో తీసిన '1'(నేనొక్కడినే), చిత్రాలు ఇవి నిజమని నిరూపించాయి. ఇక ఆయన ప్రతి చిత్రం సమయంలో కూడా ఇందులో ప్రేక్షకులకు అర్ధం కాని పజిల్స్ ఏమి ఉండవని, ఇది ఓ సాధారణ కథతో రూపొందిందని చెబుతూనే ఉన్నా, సినిమా విడుదలైన తర్వాత చూస్తే మాత్రం యథా సుకుమార్ అన్నట్లుగానే ఈ చిత్రాలు ఉండేవి. అయితే ఆయనకు ఏ క్లాస్ ఆడియన్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్, ఓవర్‌సీస్‌లో అభిమానులు, ఆయన్ను ఇష్టపడే ప్రేక్షకుల సంఖ్య మాత్రం అధికమే. కానీ ఆ వర్గం చాలా చిన్నది. దాంతో ఆయన చిత్రాలు బాగున్నాయని పేరు వచ్చినా, టివి చానెల్స్‌లో ప్రసారమయ్యే సమయంలో మంచి టీఆర్పీలు సాధించినా కూడా పక్కాగా కమర్షియల్ హిట్స్ మాత్రం ఆయనకు తక్కువే.
ఇక ఈ 14ఏళ్లలో ఆయన చేసినవి కేవలం ఏడే చిత్రాలు కావడం గమనార్హం. అయితే సుకుమార్ ఇంత కాలానికి గాను తన మాట మీద నిలబడ్డాడు. 'రంగస్థలం' చిత్రం ఓ సింపుల్ స్టోరీ అని, ఓ పీరియాడికల్ మూవీగా సాగుతుందని, ఇందులో ప్రేక్షకులకు అర్ధం కాని ట్విస్ట్‌లంటూ ఏమీ ఉండవని చెప్పిన మాట నిజం చేశాడు. పక్కా ఊరమాస్ కథను అంతే కొత్తగా స్టైలిష్‌గా చూపించిన భారీ విజయం అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ, 'జగడం' సమయంలో నాకు మెచ్యూరిటీ లేదు. 'జగడం' సినిమా నుంచి ఏమి మారుస్తారు? అని అడిగితే ఆడియన్స్‌ను మారుస్తానని కోపంగా చెప్పాను. కానీ '1' నేనొక్కడినే విషయంలో మాత్రం నేను ప్రేక్షకులను తప్పు పట్టలేదు. ఆ చిత్రంలో నేను చేసిన లోపాలను గుర్తించాను కాబట్టే ఇప్పుడు 'రంగస్థలం' వంటి చిత్రం తీయగలిగాను. '1' నేనొక్కడినే విషయంలో మాత్రం నేను ఎప్పుడు ప్రేక్షకులను నిందించలేదు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి సుకుమార్‌లో వచ్చిన ఈ మార్పు అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది.