సంగీత దర్శకులు పాటలు పాడాలని, అలాగే పాడకూడదని ఏమీ రూల్ లేదు. కానీ ఆర్‌పి పట్నాయక్ నుంచి రమణ గోగుల వరకు సింగింగ్ మత్తులో పడి తమ మ్యూజిక్ డైరెక్టర్‌కి న్యాయం చేయలేకపోయారు. వారి చిత్రాలలో అధికమైన పాటలను వారే పాడేసుకుంటూ ఉండటంతో మొనాటనీ వచ్చి చివరకు సంగీత దర్శకులుగా కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక చక్రి నుంచి కీరవాణి వరకు కూడా ఇదే దారిలో పయనిస్తున్నారు. అదే ఇళయరాజా వంటి వారు మరీ తాము పాడితేనే బాగుంటుందని అప్పుడప్పుడు గొంతు సవరించుకుంటూ ఉండేవారు. దాంతో ఆయా పాటలు ఆ చిత్రాలకు ప్లస్ అయ్యేవి. కానీ అదే పనిగా వరుసగా పాడుతూ ఉంటే మాత్రం శ్రోతలు తట్టుకోవడం కష్టమే. ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే ఆయన గొప్ప సంగీత దర్శకుడు అయి ఉండవచ్చు. కానీ ఈయన గొప్పగాయకుడు మాత్రం కాదు. ఏదో తన తండ్రికి అంకితంగా 'నాన్నకు ప్రేమతో' పాటను పాడితే ప్రేక్షకులు ఆదరించారు. కానీ అదే పనిగా పాడితే మాత్రం విసుక్కుంటున్నారు. ఇక 'రంగస్థలం'లో కూడా 'రంగ..రంగా.. రంగస్థలాన' పాట విషయంలో కూడా దేవిశ్రీ గాత్రంపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆయన వాయిస్ గొప్పగా లేదని అందరు తేల్చారు.
ఇక ఈ చిత్రం ఆడియో అల్బమ్‌లో పొలిటికల్ టచ్ ఉన్న 'ఆ గట్టునుంటావా నాగన్నా' పాట హైలైట్‌గా నిలిచి ఇన్‌స్టెంట్ హిట్ అయింది. పాలిటిక్స్ నేపధ్యంలో సాగే పాట కావడంతో ఈ చిత్రానికి ఈ పాట పెద్ద హైలైట్ అవుతుందని భావించారు. జానపద పాటగా రూపొందిన ఈ పాట ఒరిజినల్ వెర్షన్‌ని పాడింది జానపద గాయకుడు శివనాగులు. ఆయన గొంతు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండటంతో అందరు ఆ పాటపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తీరా ఆ చిత్రానికి వెళ్లి ఆ పాట ఎప్పుడు వస్తుందా? అని వేయికళ్లతో ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆ పాట షాకిచ్చింది. సినిమాలో ఆడియో ఆల్బమ్‌లో ఉన్నట్లుగా శివనాగులు గొంతు లేదు. దాంతో అందరు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ పాటను మరలా దేవిశ్రీ చేత రికార్డింగ్ చేయించి, ఆయన గొంతుతోనే ఈ పాటను సినిమాలో ఉంచారు. మరి ఇంత మంచి పాటను ఎందుకు చెడగొట్టావ్ దేవీ అని అందరు మండిపడుతున్నారు. ఈ సింగర్ పిచ్చి పట్టుకుంటే ఆటోమేటిగ్గా దేవిశ్రీ కూడా రాంగ్‌రూట్‌లో వెళ్తున్నట్లే లెక్క.