ఇటీవలే హీరో సుమన్ తనని కేసీఆర్ ఆహ్వానిస్తే టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతానని, కావాలంటే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని, గౌడ కులస్థులకు కేసీఆర్ చేసిన మేలుకి ఆయన కాళ్లు మొక్కాలని చెప్పాడు. ఇక ఇటీవల కేంద్రంలోని బిజెపిని టార్గెట్ చేసిన ప్రకాష్‌రాజ్ తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి అసెంబ్లీకి వచ్చి ఆశ్చర్యపరిచారు. త్వరలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నానని చెప్పిన నేపధ్యంలో ఆయన ప్రకాష్‌రాజ్‌ని కలవడం చూస్తుంటే ఫెడరల్ ఫ్రంట్‌లో ప్రకాష్‌రాజ్‌ది కూడా ముఖ్య భూమిక ఉంటుందని అర్ధమవుతోంది. ఇక తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. మొదటి నుంచి రాఘవేంద్రరావు టిడిపి అనుకూలుడు. చంద్రబాబుకి క్లోజ్‌గా ఉండటమే కాదు.. ఎన్నికల సమయంలో ప్రచారం చేసే నిమిత్తం తీసే ప్రకటనలను ఆయనే రూపొందించేవాడు. ఇక ప్రస్తుతం చంద్రబాబు రాఘవేంద్రరావుకి టిటిడి బోర్డ్ సభ్యుని పదవి ఇచ్చాడు. ఆయనకు టిటిడి చైర్మన్ పదవి ఇవ్వనున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ భేటీకీలకంగా మారింది.
ఇక ఇంతకాలం ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మౌనంగా ఉన్న టాలీవుడ్ ప్రముఖులు తాజాగా చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఇలా చంద్రబాబుని కలిసిన వారిలో అశ్వనీదత్, కె.యస్.రామారావు, కె.ఎల్. నారాయణ, రాఘవేంద్రరావు, జెమిని కిరణ్, టి. వెంకటేశ్వరరావు, జీకే వంటి వారు ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం కోసం ఈ ఉద్యమంలో తాము కూడా పాల్గొంటామని, ఈనెల 6వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూనే షూటింగ్‌లకు హాజరవుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేంద్రం ఏపీకి చేసిన మోసం గురించి వారికి వివరించారు.