సుకుమార్.. ఈయన పేరు వింటేనే సాధారణ ప్రేక్షకులు హడలిపోతారు. కింది స్థాయి వారికి అర్ధం కాని ఇంటెలిజెంట్ చిత్రాలు తీయడంలో ఈయన ఎక్స్‌పర్ట్. దాంతో ఈయన చిత్రాలు బి, సి సెంటర్లలో సరిగా ఆడకపోయినా మల్టీప్లెక్స్, ఓవర్‌సీస్‌లలో మాత్రం ఓ ఊపు ఊపుతాయి. చివరకు ఆయన తీసిన '1' (నేనొక్కడినే) చిత్రం ఇక్కడ ఫ్లాప్ అయినా కూడా ఓవర్‌సీస్‌లో మంచి కలెక్షన్లు సాధించింది. ఇక ఈ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఈసారి మాత్రం సాధారణ ప్రేక్షకులకు కూడా అర్ధమయ్యే చిత్రంగా 'రంగస్థలం' తీశానని చెబుతున్నాడు. ఆయన ప్రతిసారి ఇదే మాట చెబుతూ వస్తుంటాడు. 'నాన్నకుప్రేమతో' చిత్రం సమయంలో కూడా ఇదే చెప్పాడు. ఇక ఈ క్రియేటివ్ జీనియస్ విషయానికి వస్తే ఈయన కూడా సినిమాను జక్కన్నలా చెక్కేందుకు రెండేళ్లకు ఓ చిత్రం మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 14ఏళ్లు అయినా ఆయన తీసినవి కేవలం ఏడు చిత్రాలేకావడం విశేషం.
ఇక ఈయన ప్రతి చిత్రం షూటింగ్ సమయంలో లేదా సినిమా ప్రమోషన్స్‌లో తన తదుపరి చిత్రం ఎవరితో అనేది చెబుతుంటాడు. కానీ 'రంగస్థలం' విషయంలో మాత్రం దీని తర్వాత తాను ఎవరితో సినిమా చేయనున్నాడు అనే విషయాన్ని బయటపెట్టకుండా మౌనంగా ఉంటూ ఉన్నాడు. 'రంగస్థలం' విడుదలై, దాని ఫలితం చూసిన తర్వాతనే ఆయన తన తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేస్తాడని తెలుస్తోంది. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ కాంబినేషన్లు కుదరడంతో తన అన్నిచిత్రాలు భారీబడ్జెట్‌లోనే రూపొందాయి. '1' నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో పాటు రంగస్థలం చిత్రానికి కూడా భారీ విలేజీ సెట్ వేయడం, ఎంతో కాలం వర్కింగ్ డేస్ కావడంతో బడ్జెట్ భారీగానే పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని ఓ యంగ్ హీరోతో మీడియం రేంజ్ బడ్జెట్‌తో, కంటెంట్ ప్రధానంగా సినిమా తీయనున్నాడని సమాచారం. చిరంజీవి, అల్లుఅర్జున్‌ల పేర్లు వినిపించినా అవి నిజం కాదని సుకుమార్ తేల్చేశాడు. మరి ఆయన తదుపరి చిత్రం నానితో ఉండవచ్చని, ఆ యంగ్ హీరో నానినే అని ప్రచారం జరుగుతోంది. మరి సుక్కు మనసులో ఏముందో? ఆయనే క్లారిటీ ఇచ్చేదాకా చెప్పలేం...!