మోహన్‌బాబు.... ఈయన కలుగజేసుకోని అంశం అంటూ ఉండదు. ఏ విషయాన్నైనా కెలుకుతూనే ఉంటాడు. చెప్పేవి శ్రీరంగనీతులుగా ఉంటాయి. కానీ చేసేవి మాత్రం వేరే విధంగా ఉంటాయి. ఆమద్య ఇవాంకా పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్ నుంచి తన ఇంటికి చేరుకోవడానికి కారులో రెండు గంటలు పట్టిందని, ఇది చాలా చికాకు తెచ్చే పరిస్థితి అని, ఇవాంకా వస్తే ఆమె కోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా? అని ఆయన కుమార్తె లక్ష్మీప్రసన్న మండిపడింది. దానికి ఓ నెటిజన్ సమాధానం ఇస్తూ మీ సెలబ్రిటీలందరూ నేరుగా వెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుడిని నేరుగా సందర్శిస్తూ ఉంటే క్యూలైన్లలో గంటలకు గంటలు నిలబడే మేము కూడా మిమ్మల్ని చూసి ఇలాగే ఫీలవుతామని ఘాటు రిప్లై ఇచ్చింది. ఇక మోహన్‌బాబుకు తన చిత్రాలలో తనకి అవసరం ఉన్నపార్టీ కోసం ఎదుటి పార్టీని టార్గెట్ చేయడం ఆయన నైజం. ఈయన కూడా ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి పుణ్యమా అని రాజ్యసభ ఎంపీగా పనిచేశాడు. మరి నాడు ఆయన చేసిన సేవ ఏమిటో ఆయనకే తెలియాలి. ఇక ఇటీవల ఆయన హామీలు నెరవేర్చని 99శాతం రాజకీయ నాయకులు ఫూల్స్, ఇడియట్స్ అని వ్యాఖ్యలు చేశాడు.
ఇక వజ్రోత్సవాల సందర్భంగా కొందరు సినీ పెద్దలను సిల్లీ ఫెల్లోస్ అన్నాడు. 'దేనికైనారెడీ'లో బ్రాహ్మణులను, ఓ పండితుడి భార్యని ఎవరిని చూసినా తన భర్తని చూసినట్లు ఫీలయి కౌగిలించుకునే ట్రాక్ నడిపాడు. ఇక పండితులు హలాల్ తిన్నట్లుగా చూపించాడు. ఇలా వీరు మాత్రం ఎందరినైనా అవహేళన చేయవచ్చు. అదే తమ దాకా వస్తే మాత్రం పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కుతున్నారు. తాజాగా సినిమా ఫీల్డ్‌పై ఓ చానెల్ ఎడిటర్ తప్పుడు వ్యాఖ్యలు చేశాడని, నటీనటులను, మరీ ముఖ్యంగా మహిళలను కించపరిచారని మా అసోసియేషన్ తరపున శివాజీరాజా నేతృత్వంలోఆ ఎడిటర్‌పై కేసు నమోదు చేయించారు. దీని గురించి లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ, విషయం ఏదైనప్పటికీ మహిళలను లేబులింగ్ చేస్తూ ఎవ్వరు తప్పుగా మాట్లాడకూడదు. నటీమణులను ఉద్దేశించి ఇలా మాట్లాడటాన్ని ఎవ్వరూ అంగీకరించరు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదు. పబ్లిసిటీ కోసం మహిళలను ఇలా మాట్లాడటం క్షమించరాని నేరం అని మండిపడింది. మరి సినిమా వారు ఇతరులను, ఇతర సామాజిక వర్గాలు, రాజకీయ నాయకుల నుంచి అన్నిరంగాల వారిని మాత్రం ఎలాగైనా చూపంచవచ్చు. తమ దగ్గరికి వచ్చేసరికే నీతులు చెబుతారన్న మాట...!