మలయాళం నుండి తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి, మిడిల్ క్లాస్ అమ్మాయిలా అల్లుకుపోయిన సాయి పల్లవి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లోను దున్నేస్తుంది. ఇప్పటికే శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి తమిళంలోనూ సూర్య పక్కన నటిస్తోంది. ఈమధ్యలో సాయి పల్లవికి పొగరెక్కువ, దర్శక నిర్మాతలతో పాటు ఒక టాలీవుడ్ హీరోని కూడా లెక్కచెయ్యకుండా ఉందనే ప్రచారం ఉన్నా కూడా సాయి పల్లవికి అవకాశాల మీద అవకాశాలు వస్తూనే వున్నాయి. ప్రస్తుతం అమ్మడు నటించిన కణం సినిమా తెలుగు, తమిళంలో విడుదల కావాల్సిఉంది.
ఈ హీరోయిన్ ఎక్కువగా హీరో పాత్ర కన్నా హీరోయిన్ పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలని ఓకే చేసుకుంటూ వస్తుంది. ఫిదా సినిమాలో భానుమతిగా అదరగొట్టిన సాయి పల్లవి, కణం సినిమా కథ మొత్తం సాయి పల్లవి చుట్టూ తిరిగే కథే. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా పక్కన నటిస్తున్న సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో మరో మూవీకి ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. నీది నాది ఒకే కథ సినిమాతో అదరగొట్టే హిట్ కొట్టిన వేణు ఉడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి సినిమా చెయ్యడానికి రెడీ అయ్యిందనే న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
నీది నాది ఒకే కథ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా తెరకెక్కించి క్రిటిక్స్ నుండి ఫుల్ మార్కులు వేయించుకున్న వేణు ఉడుగుల సాయి పల్లవికి ఒక స్టోరీ లైన్ వినిపించాడని... ఈ కథలో హీరోయిన్ కి ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం వలన ఈ సినిమా చెయ్యడానికి సాయి పల్లవి ఒకే చెప్పిందని టాక్ బయటికి వచ్చింది. మరి సాయి పల్లవి ఓకే చెప్పగానే వేణు ఉడుగుల పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాడని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.