మంచు మనోజ్ కెరీర్‌లో ఇప్పటి వరకు చెప్పుకోదగిన హిట్ ఒక్కటి కూడా లేదు. ఏదో 'పోటుగాడు' ఫర్వాలేదనిపించింది. సన్నిలియోన్‌ని తెప్పించి 'కరెంట్ తీగ' చేసినా, బాలయ్యని ఒప్పించి ఆయన ముఖ్యపాత్రలో 'ఊకొడతారా.. ఉలిక్కిపడతారా' వంటి చిత్రాలు చేసినా, చివరకు ఎల్టీటీటీఈ, కెప్టెన్ ప్రభాకరన్ స్ఫూర్తిగా 'ఒక్కడు మిగిలాడు' చేసినా, 'నేను మీకు తెలుసా' అన్నా కూడా ప్రేక్షకులైతే పట్టించుకోలేదు. ఈ సమయంలో ఆయన ఇక సోలో హీరోగా చేయడం అనవసరం....'వేదం' వంటి చిత్రాలలో కీలకపాత్రలను పోషిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈయన పెద్ద దర్శకుల జోలికిపోకుండా కొత్త దర్శకులు, యంగ్ డైరెక్టర్స్‌ని పెట్టుకుంటాడని, కేవలం దర్శకత్వం నుంచి డ్యాన్స్‌లు, ఫైట్స్.. ఇలా ప్రతి విషయంలోనూ తన అభిరుచి చూపించడానికే ఆయన ఆ ప్రయత్నాలు చేస్తున్నాడనే విమర్శ కూడా ఉంది. ఇక రాఘవేంద్రరావుతో 'ఝుమ్మందినాదం' చేసినా లాభం లేకుండా పోయింది. ఇక ఆ మధ్య తాను చిత్రాల నుంచి వైదొలుగుతానని సంచలన ప్రకటన చేసి తర్వాత మా నాన్న తిట్టాడు.. మా అన్న తిట్టాడు అంటూ మరలా మొదటికి వచ్చాడు.
ఇక ఈయన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత మరో చిత్రం చేయలేదు. ఆ చిత్రంలోని పాత్ర కోసం బాగా బరువు పెరగడంతో దానిని తగ్గించే పనిలో పడ్డాడట. ఇక ఇంతకాలం ఆయన పలువురు చెప్పిన కథలు వింటూ ఎట్టకేలకు ఓ నూతన దర్శకుడైన చందు అనే డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా 'ఒక్కడు మిగిలాడు' పాత్రలా కాకుండా మరలా పాత మనోజ్ తెరపై కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి కొత్త దర్శకులు ఇటీవల వరుస విజయాలు సాధిస్తున్నారు. వెంకీ అట్లూరి, వెంకీ కుడుముల, వేణు ఉడుగుల, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు మెప్పించారు. ఇక మంజుల, 'టచ్ చేసి చూడు' విక్రమ్ సిరికొండ వంటి వారు దెబ్బతిన్నారు. ఈ చిత్రం మే నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరి మనోజ్ పరిచయం చేసే కొత్త దర్శకుడు ఏ కోవలోకి వస్తాడో వేచిచూడాల్సివుంది...!