సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అవకాశాల కోసం ఏ చిత్రం వచ్చినా ఒప్పుకుంటారు. అలా కెరీర్ సాగుతున్న నేపధ్యంలో ఓ మంచి హిట్ చిత్రం, మంచి పాత్ర వచ్చిన తర్వాత వారి దశ తిరిగిపోతుంది. దీంతో తాము అంతకుముందు చేసిన సినిమాలు, పాత్రలను చూసి ఇలాంటివి ఎందుకు చేశామా? అనే ఆలోచనలో పడతారు. ఇక ఫేడవుట్ అయిన తర్వాత, కెరీర్‌ముగిసిన తర్వాత, పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా కొందరు హీరోయిన్లు ఇంతకుముందు చేసిన పాత్రలను చూస్తే ఆ సినిమాలకు మేమెందుకు ఒప్పుకున్నామా? అని బాధపడుతున్నామని చెబుతూ, అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు, హీరోలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. కెరీర్ ప్రారంభంలో తమకి అదే మహా ప్రసాదంగా నిలిచి, కనీసం ఫేడవుట్ కాకుండా లైన్‌లో ఉండేందుకు ఆ చిత్రాలే దోహదపడ్డాయన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇక ఇటీవల సమంత కూడా పెళ్లయిన తర్వాత 'రాజుగారి గది 2' చిత్రం ప్రమోషన్స్‌లో తాను గతంలో నటించిన చిత్రాలు ఎందుకు నటించానా? అని బాధపడుతున్నానని, ఇక నుంచి నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తానని చెప్పి పలు విమర్శలను ఎదుర్కొంది. ఇప్పుడు అదే రూట్‌లో రాశిఖన్నా పయనిస్తోంది. ఈమె ఎంతో కాలంగా సగటు హీరోయిన్ చేసే సాధారణ గ్లామర్‌షో పాత్రలు చేసింది.
ఒక్కసారిగా 'తొలి ప్రేమ' చిత్రంతో ఈమెకి మంచి పేరు, ఈ పాత్రకి మంచి ప్రాధాన్యం రావడంతో ఆమె తాను గతంలో ఓ చిత్రంలో ఎందుకు నటించానా? అని బాధపడుతున్నానని, ఆ కథ చెప్పేటప్పుడు అంతా బాగానే ఉందని, కానీ స్క్రీన్‌మీద చూసుకుంటే ఇలాంటి పాత్ర ఎందుకు చేశానా? అని బాధపడుతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఇక ఆ చిత్రం ఏమిటో ఆమె పేరు చెప్పకుండా ప్రతి ఒక్కరు అది మన చిత్రమా? లేక ఆ చిత్రమా? ఈ చిత్రమా? అని సందేహాలు వచ్చేలా చేసింది. నిజానికి ఇండస్ట్రీలో నిత్యామీనన్, మీరాజాస్మిన్, కీర్తిసురేష్, సాయిపల్లవి వంటి వారు మొదటి చిత్రం నుంచి ఒకే మాట చెబుతూ ఉంటారు. తాము గ్లామర్‌షోలు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు చేయమని, మరో పదేళ్లు ఆగి అడిగినా ఇలాగే సమాధానం చెబుతామని అంటున్నారు. మరి వారితో పోల్చుకుంటే తమకి అవసరానికి అవకాశం వచ్చి అన్నం పెట్టిన వారిని తిట్టడం కిందకే సమంత, రాశిఖన్నాల వ్యాఖ్యలు వస్తాయి. ప్రతి ఒక్కరు తాము చేసే చిత్రాలు, పాత్రలు బాగా క్లిక్ అవ్వాలని, తద్వారా పది సినిమాలలో అవకాశాలు రావాలనే చేస్తారు. కానీ ఇలాంటి వారికి మాత్రం విజయం తలకెక్కిన తర్వాతే అవి గుర్తుకొస్తాయి.