టాలీవుడ్ కి ప్రస్తుతం రంగస్థలం ఫీవర్ పట్టుకుంది. ఎందుకంటే తొలిప్రేమ హిట్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి సినిమా థియేటర్స్ లోకి రాలేదు. కొన్ని రోజులు బంద్, మరికొన్ని రోజులు ప్లాప్ సినిమాలు.. ఇలా వారం వారం ప్రేక్షకులను బోర్ కొట్టించేశాయి. మరి చాలా రోజులకు ఒక చక్కటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ రంగస్థలం సినిమా వస్తుంది అనగానే ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం వచ్చేస్తోంది. అయితే వచ్చే శుక్రవారం విడుదల కాబోయే రంగస్థలం ప్రమోషన్స్ పిచ్చ పీక్స్ లో ఉన్నాయి. అప్పటికే ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అభిమానులను ఒక ఊపు ఊపిన రంగస్థలం యూనిట్ ఇప్పుడు పాటల మేకింగ్ వీడియోస్ తో కట్టిపడేస్తున్నాయి.
తాజాగా నిన్న సాయంత్రం రామ్ చరణ్, సమంతల చిట్టిబాబు, రామలక్ష్మిలు ఉన్న ఎంత సక్కగున్నావే పాటకు ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఆ పాటలో చిట్టి బాబు లుంగీ కట్టుకుని డాన్స్ చేస్తూ అదరగొట్టేస్తుంటే... రామలక్ష్మిలా సమంత లంగాఓణిలో పొలం పనులు చేసుకుంటూ, మొక్కజొన్న తోటలో కూర్చుని అన్నం తింటూ, గేదెలను చెరువులో కడుగుతూ, రాగి చెంబుతో నీళ్లు తాగుతూ, పొయ్యి దగ్గర కూర్చుని బియ్యం ఏరుతూనే మట్టిగెడ్డలు నోట్లో వేసుకుంటూ అబ్బో అమ్మడు ఇచ్చిన ఫోజులకు అందరూ ఫిదా. పల్లె అందాలతో పాటు చిట్టిబాబుగా చరణ్, రామలక్ష్మిగా సమంత చంపేస్తుంటే.. దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటకు ఇచ్చిన మ్యూజిక్ నిజంగానే ఎంత సక్కగున్నదే అనిపిస్తుంది.
1985 లో పల్లె అందాలను అందంగా చూపిస్తూ ఆనాటి గుర్తులను అలాగే చూపిస్తూ ఎక్కడా మోడ్రెన్ అన్న పదం వాడడం కాదు... అసలు ఎక్కడ అలాంటి ఛాయలే లేకుండా ఈ రంగస్థలంని మనం చూడబోతున్నాం. పల్లెటూరిలో స్వచ్ఛమైన ప్రేమలు, అంటే ఈర్ష్యలు, అలాగే పగలు, పట్టింపులు ఇలా అన్ని మిళితమైన రంగస్థలంని మరో వారం రోజుల్లో కన్నులార వీక్షించబోతున్నాం అంటేనే అందరిలో ఒక రకమైన ఆనందం వచ్చేస్తుంది. మరి దర్శకుడు సుకుమార్ పల్లె అందాలు ఇంకే రేంజ్ లో ప్రెజెంట్ చేశాడో తెలియాలి అంటే మరొక్క వారం ఆగి తీరాల్సిందే.