సినిమా రంగం చిత్ర విచిత్రమైన రంగం, బండ్లు ఓడలవుతుంటాయి.. ఓడలు బండ్లవుతుంటాయి. క్రేజ్ ఉన్ననాడే సంపాదించుకుని కాపాడుకుంటే తదుపరి భవిష్యత్తులో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కానీ వ్యసనాలకు బానిసలైన వారు. జల్సాలకు అలవాటు పడిన వారు, మంచి తనానికి పోయి సర్వం కోల్పోయిన వారు ఆరోగ్యం బాగాలేని సమయంలో, కెరీర్‌లో ఫేడవుట్ అయి, చివరి రోజుల్లో దీనావస్థలో గడిపిన వారు మన ముందు ఉదాహరణలకు ఎందరో ఉన్నారు. అలాంటి నటీనటుల కోవలోకి ప్రముఖ నటి ప్రియా దడ్వాల్ చేరింది. ఈమెకి టిబి సోకిందని తెలిసి, ఈమె భర్తతో పాటు అందరు ఈమెని హాస్పిటల్‌లో వదిలేసి వెళ్లిపోయారు. తాను చికిత్స చేయించుకునేందుకు కూడా డబ్బులు లేవని, టీ తాగడానికి కూడా ఎవరినో అడుక్కోవాల్సి వస్తోందని ఆమె చెబుతోంది.
ఇక ఈమె 1990లో సల్మాన్‌ఖాన్ నటించిన 'వీర్‌గతి' చిత్రంలో నటించింది. 1997లో వచ్చిన 'తుమ్‌సే ప్యార్ హోగయా' చిత్రంలో భోజ్‌పురి స్టార్, తెలుగులో 'రేసుగుర్రం' వంటి చిత్రంలో విలన్‌గా నటించిన రవికిషన్‌తో పూజా పేరుతో కలిసి నటించింది. మరోవైపు సల్మాన్‌కి తన పరిస్థితి తెలిస్తే తనని ఖచ్చితంగా ఆదుకుంటాడని ఆమె నమ్మకంతో ఉంది. కానీ ఆయన్ని కలవడానికి వీలు చిక్కడం లేదు. సల్మాన్ మరోవైపు సినిమా షూటింగ్‌లో భాగంగా అబుదాబిలో ఉన్నాడు. అయినా సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఆయన ఏ దేశంలో ఉన్నా ఆమె తనపై పెట్టుకున్న నమ్మకం, ఆమె దుస్థితి సల్మాన్‌కి క్షణాలలో తెలుస్తాయి. కాబట్టి అక్కడ షూటింగ్ బిజీలో ఉన్నా కూడా తన వారి ద్వారా ఆమెకి సాయం చేయడం క్షణాలలో పని. కానీ సల్మాన్ ఆమె మొర ఆలకించినట్లు లేదు. కానీ రవికిషన్ మాత్రం ఆమె దుస్థితిని తెలుసుకుని ముంబైలోని తన స్నేహితుడైన ఉదయ్‌భగత్ ద్వారా ఆమె వైద్యానికి అవసరమైన డబ్బులు, పండ్లు వంటివి పంపి తన విశాల హృదయం చాటుకున్నాడు.