మహారాష్ట్ర కేడర్‌కి చెందిన మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి స్వచ్చంధంగా రాజీనామా చేశారు. ఆయన ఎంతో స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎమ్మార్ ప్రాపర్టీస్, సత్యం కుంభకోణం వంటి వాటిపై విచారణ చేశారు. ఇక జగన్‌కి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈయన నాడు దేశవ్యాప్తంగా తన కఠినమైన ధోరణితో వణుకు పుట్టించాడు. నాటి నుంచి ఆయనకంటూ దేశంలో మరీ ముఖ్యంగా సమైక్యాంద్రలోని రాష్ట్రాలలో మంచిపేరు వచ్చింది. నాటి ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేసిన టి.ఎన్.శేషన్ తరహాలోనే సిబిఐ తలుచుకుంటే నిందితులు ఎంత తెలివిగలిగిన వారైనా, వారు చేసిన అవినీతిని బయటకు తీయడం సాధ్యమేనని ఆయన నిరూపించారు. ఇక ఈయన ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డిజిగా పనిచేస్తున్నారు. ఆయన స్వచ్చంధంగా పదవీ విరమణ చేస్తున్నట్లు దృవీకరించమే కాదు.. తన రాజీనామా లేఖని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, డిజిపికి పంపారు. కేంద్రప్రభుత్వం దీనిని ఆమోదించాల్సివుంది.
ఇక గత కొంతకాలంగా బిజెపి జెడీ లక్ష్మీనారాయణను ఏపీ రాజకీయాలలోకి తేవాలని భావిస్తూ వస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రాజీనామాతో వాటికి బలం చేకూరింది. ఇక ఈయన నిన్నటి జయప్రకాష్ నారాయణ్ లాగా కనుమరుగవుతాడా? లేక కేజ్రీవాల్ గా రాజకీయాలలో రాణిస్తాడా? అనేది వేచిచూడాల్సివుంది. ఇక ఈయన ప్రాంతీయ పార్టీలలో చేరడని, కేవలం జాతీయ పార్టీతోనే ముందుకు వెళ్తాడని, అది కూడా బిజెపిలోనే చేరుతాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కొందరు ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి జగన్ అవినీతి కేసుల చేధన విషయంలో ఎంతో దూకుడుగా వ్యవహరించిన ఆయన రాజకీయాలలో కూడా అదే దూకుడు చూపిస్తాడో లేదో వేచిచూడాల్సివుంది.