ఒక చిత్రం స్ఫూర్తితో ఆ వెంటనే అదే తరహా చిత్రాలు వరుసగా రావడం చూస్తూనే ఉన్నాం. రజనీకాంత్ 'బాషా' చిత్రం స్ఫూర్తితో 'సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఆది, సింహాద్రి' వంటి ఎన్నో చిత్రాలు రూపొందాయి. ఇక హాలీవుడ్‌లో వచ్చిన 'గాడ్‌ఫాదర్' స్ఫూర్తితో అన్ని భాషల్లో కలిపి ఎన్ని చిత్రాలు వచ్చాయో లెక్కించడం కూడా కష్టమే. వర్మ చిత్రాలలో 'గాడ్‌ఫాదర్' ఎఫెక్ట్ బాగా ఉంటుందని వర్మనే ఒప్పుకున్నాడు. ఇక మణిరత్నం తీసిన 'నాయకుడు, దళపతి' వంటి చిత్రాలు గాడ్‌ఫాదర్ ఆధారంగా, మహాభారతం ఆధారంగా స్ఫూర్తి నింపినవే. ఇక విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అజ్ఞాతవాసి' చిత్రం విషయంలో ఎదుర్కొన్న విమర్శలు అన్ని ఇన్ని కాదు. మరోకరైతే ఈ దెబ్బకి సినిమాలు చేతిలో లేక ట్రైన్ ఎక్కేవారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన సత్తా చూపించాలని భావించడం, ఎన్టీఆర్ కూడా ఒకే చెప్పడం జరిగింది. ఇక ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 12 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా ఓపెనింగ్ జరిగింది. ఎన్టీఆర్ నటించిన 'జై లవకుశ' విడుదలై ఆరునెలల తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఇక వర్మకి 'గాడ్‌ఫాదర్' ఎలా స్ఫూర్తో.. త్రివిక్రమ్‌కి మధుబాబు నవలలు అంటే ఎంతో ఇష్టం. పుస్తకాల పురుగైన త్రివిక్రమ్ మధుబాబు నవలలన్నింటిని చదివిందే చదువుతూ ఉంటాడు. ఆమధ్య ఆయన్ను వెత్తుకుంటూ వెళ్లి కలిసి కూడా వచ్చాడు.
ఇక ఆయన తాజాగా ఎన్టీఆర్‌తో చేస్తున్న చిత్రం మధుబాబు నవల ఆధారం అని ప్రచారం జరిగింది. ఇక 'అజ్ఞాతవాసి'ని లాంగోవిడ్జ్ నుంచి కాపీ కొట్టడం, 'అ..ఆ'ని యద్దనపూడి సులోచనా రాణి 'మీనా'నవల నుంచి త్రివిక్రమ్ స్ఫూర్తి పొందాడు. ఇక మహేష్‌తో చేసిన 'అతడు'లో హీరో క్యారెక్టరైజేషన్ ఇక రెండు మూడు సీన్స్ మధుబాబు నవల నుంచి స్ఫూర్తి పొందినవే అని నాడు త్రివిక్రమ్ కూడా ఒప్పుకున్నాడు. ఇక ఎన్టీఆర్ చిత్రం మధుబాబు నవల ఆధారంగా రూపొందడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని మధుబాబు కూడా స్పష్టం చేశాడు. తనని త్రివిక్రమ్ కలవలేదని, ఆ చిత్రం తన కథ కాదని నమ్ముతున్నానని చెప్పుకొచ్చాడు. ఇది మనం నమ్మాల్సిన విషయమే. ఎందుకంటే 'అ..ఆ' విషయంలో రచయిత్రికి మొదట క్రెడిట్ ఇవ్వకుండా తర్వాత ఇవ్వడం వివాదం సృష్టించింది. ఇక 'అజ్ఞాతవాసి'కి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలిసిందే. దీంతో మరోసారి త్రివిక్రమ్ అదే తప్పు చేసే ప్రసక్తిలేదు. కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, హీరోని ఆవిష్కరించే విధానం మాత్రం మధుబాబు నవలల నుంచి స్ఫూర్తి పొందే రాసుకున్నాడని అంటున్నారు. మొత్తానికి ఇది కాపీ కాదు.. కేవలం స్ఫూర్తి అనే చెప్పాలి.