మాటలు నేర్చిన చిలుక ఉస్కో అంటే డిస్కో అంది అనే సామెత ఉంది. అది మన టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నాకి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. 'ఊహలు గుసగుసలాడే, జోరు, బెంగాల్‌టైగర్, సుప్రీమ్, జై లవకుశ, తొలిప్రేమ' చిత్రాలతో ఈమె బాగా పేరు తెచ్చుకుంది. ఇక తాజాగా వచ్చిన 'తొలిప్రేమ' అయితే ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా చేయగలదని నిరూపించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆమెకి ఏకంగా మంచి యంగ్ హీరోల సరసన డజనుకు పైగా ఆఫర్స్ వచ్చాయట. వీటిలో వేటిని ఒప్పుకుంటుందో? లేదో?చూడాలి. ఎందుకంటే గ్లామర్ హీరోయిన్ అనే ముద్ర నుంచి 'తొలిప్రేమ' చిత్రంతో ఆమె నటనా ప్రతిభ అందరికీ తెలిసింది. దీనిని అవకాశంగా మలుచుకుని సరైన ప్రాజెక్ట్‌లు ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత రాశిఖన్నాపైనే ఉంది.
ఇక విషయానికి వస్తే కుర్రకారు మనసులను కొల్లగొట్టిన ఆమె తాజాగా మాట్లాడుతూ, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను. ముఖ్యంగా రకుల్‌ప్రీత్‌సింగ్, లావణ్యత్రిపాఠిలతో నాకు చాలా మంచిస్నేహం ఉంది. ఇక హీరోలతో కూడా ఫ్రెండ్‌షిప్ ఎక్కువ అనే మాట నిజమే... అని చెప్పుకొచ్చింది. ఓ మెగా హీరోతో ప్రేమలో పడ్డారట నిజమేనా? అని ప్రశ్నిస్తే, ఆ మెగా హీరో ఎవరో చెప్పండి? ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని కొట్టిపడేసింది. ఇక హిందీలో ఎవరితో నటించాలని ఉంది? అని ప్రశ్నిస్తే హిందీలో రణవీర్‌కపూర్‌తో చేయాలని ఉంది అని సమాధానం ఇచ్చింది. మరి తెలుగులో ఎవరితో నటించాలని భావిస్తున్నారు ? అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ఎవ్వరినీ హర్ట్ చేయకుండా లౌక్యంగా సమాధానం ఇచ్చి ఆయా స్టార్స్ దృష్టిలో పడేందుకు మహేష్, పవన్, బన్నీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ అంటూ అందరి పేర్లు ఏకబిగిన చెప్పి ఎంతైనా మాటలు నేర్చిన చిలక కదా...! అని నిరూపించుకుంది...!