జనసేన ఆవిర్భావ సభలో పవన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా పవన్ ప్రసంగం కొన్ని అనుమానాలకు తావిచ్చేలా వన్‌సైడ్‌గా సాగిందనే విషయంలో మాత్రం అందరు ఏకీభవిస్తున్నారు. నారా లోకేష్ అవినీతి విమర్శించే సమయంలో జగన్, గంటా శ్రీనివాసరావు , మురళీమోహన్, నారాయణ, విజయసాయిరెడ్డి వంటి వారిని కూడా ఉపేక్షించకుండా ఉంటే బాగుండేది. అలాగే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీని, ఆయన ప్రభుత్వాన్ని కూడా పవన్ విమర్శించి ఉండి వుంటే ఈ ప్రసంగానికి పరిపూర్ణత వచ్చి అనవసర విమర్శలు వచ్చేవి కావు. మరి ఉండవల్లి ప్రభావమో లేక మరొకరి సలహా ప్రకారం స్క్రిప్ట్‌ని రెడీ చేసుకుని మాట్లాడాడు... అనే విమర్శలు బాగా వస్తున్నాయి. ఇక పవన్ గతంలో జగన్‌ని ఉద్దేశించి కోట్ల అవినీతి చేసిన వారు నాయకులైతే సమాజానికి చాలా చేటని కూడా చెప్పాడు. ఆ విమర్శ చేసినప్పుడు మాత్రం చప్పట్లు కొట్టిన టిడిపి నాయకులు ఇప్పుడు మాత్రం పవన్‌పై విమర్శకులు ఎక్కుపెడుతున్నారు. నిన్న మొన్నటి దాకా పవన్ విమర్శలను లైట్‌గా తీసుకోవాలని, ఆయన చేస్తున్న పనులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాబట్టి ఆయనను చూసి చూడనట్లు ఉండాలని స్వయంగా సీఎం చంద్రబాబే తన నాయకులకు సూచించాడు.
ఇక నారా లోకేష్ విషయానికి వస్తే ఆయన పవన్ తనపై చేసిన అవినీతి ఆరోపణల విషయంలో పరువు నష్టం దావా వేయాలనే ఉద్దేశ్యాన్ని పలువురు టిడిపి నాయకులు లోకేష్ వద్ద తీసుకుని వచ్చారు. కానీ ఈయన మాత్రం ఈ పరువు నష్టం దావా విషయం పార్టీ నిర్ణయిస్తుందని తప్పించుకుంటున్నాడు. అయినా టిడిపి అంటే లోకేష్.. లోకేష్ అంటే టిడిపి పార్టీగా మారి ఆయన కనుసన్నల్లో పనిచేస్తున్న నడుస్తున్న పార్టీ నిర్ణయిస్తుందని చెప్పాడంటే అది డొంకతిరుగుడు సమాధానమేనని చెప్పాలి. ఇక రాజకీయాలలో, రాజకీయ నాయకులు, పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. ఇలాంటి ప్రతి వాటిపై న్యాయపోరాటం చేయాలంటే కోర్టుకి ప్రతిరోజు దీనికే సమయం సరిపోతుంది. విమర్శలకు సమాధానం చెప్పాలే గానీ సమాధానం చెప్పకుండా ఇవి కేవలం నిరాధార ఆరోపణలు, లోకేష్ మంచి బాలుడు అంటూ పొగుడుకున్నంత మాత్రాన సరిపోదు. అవినీతిలో లోకేష్ కూడా జగన్ బాటలో, ఆయన తండ్రి చంద్రబాబు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బాటలో నడుస్తున్నారనే విషయం మాత్రం ప్రజలందరికీ అర్ధమవుతోంది.