అసలు యంగ్ హీరోలు కూడా తమ కెరీర్ ని ఇంతందంగా, ఇంత స్పీడుగా మలుచుకోలేరేమో అన్నట్టుగా వుంది సీనియర్ హీరో బాలకృష్ణ పని. సీనియర్ హీరోలలో వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలు ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తుంటే బాలకృష్ణ మాత్రం తానొక కుర్ర హీరో అన్న టైప్ లో ఈ వయసులోనూ చక చకా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ జోరు చూపిస్తున్న బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని పట్టాలెక్కించే పనిలో బిజీగా వున్నాడు.
ఆ సినిమా పనుల్లో బిజీగా వున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మాస్ డైరెక్టర్ బోయపాటితో చేస్తున్నాడనే టాక్ వుంది. ఈ సినిమా కూడా జూన్ నుండి సెట్స్ మీదకెళ్ళొచ్చనే న్యూస్ వుంది. మరి ఈ రెండు సినిమాలతో పాటు బాలకృష్ణ ఇప్పుడు మరో సినిమాని కూడా లైన్ లో పెట్టేట్లుగా కనబడుతున్నాడు. ఆయన గత ఏడాది డిసెంబర్లో కన్నడలో విడుదలై సెన్సేషనల్ విజయం సాధించిన ఒక సినిమాని రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. శివరాజ్ కుమార్ హీరోగా కన్నడలో తెరకెక్కిన 'మఫ్టీ'అనే సినిమాని బాలకృష్ణ రీమేక్ చెయ్యాలనుకుంటున్నాడట. కన్నడలో 'మఫ్టీ' సినిమా సెన్సేషనల్ హిట్ అవడమే కాదు అక్కడ ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.
మరి అక్కడ అంత విజయాన్ని సాధించి కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తెలుగు రీమేక్ లో చేయడానికి బాలకృష్ణ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటున్నారు. అయితే ఈ విషయమై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎంతైనా కుర్ర హీరోలు బాలకృష్ణ స్పీడుని అందుకోవడానికి కాస్తైనా ట్రై చేస్తే బావుంటుంది కదా.