పాత చిత్రాల టైటిల్స్‌నే కాదు.. ఆ కథలకు రీమేక్‌లు, నాటి ఎవర్‌గ్రీన్ సాంగ్స్‌కి రీమిక్స్‌లు బాగా వస్తున్నాయి. సినిమాలలో విషయం లేకపోయినా ప్రేక్షకుల అటెన్షన్‌ని వీటి ద్వారా సాధించవచ్చని మన మేకర్స్ అభిప్రాయం. ఇప్పటికే చిరంజీవి పాటలను రామ్‌చరణ్, సాయి ధరమ్ తేజ్‌లు ట్రై చేసి ఫెయిల్ అయ్యారు. అలాంటి క్లాసిక్స్‌ని రీమిక్స్ చేసి భ్రష్టు పట్టించకుండా ఉండటమే మంచిదని సినీ ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు. ఇక 1990లలో 'తేజాబ్' చిత్రంలో మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేసి ఆడిపాడిన 'ఏక్ దో తీన్' సాంగ్ నాడు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. అందులో మాధురి దీక్షిత్ వేసిన స్టెప్పులు, ఆమె హావభావాలు యువత నుంచి ముసలి వారి వరకు ఉర్రూతలూగించాయి. ఇక ఈ 'తేజాబ్'కి రీమేక్‌గా తెలుగులో దాసరి నారాయణరావు వెంకటేష్, రాధ జంటగా 'టూ టౌన్ రౌడీ'గా రూపొందించి అందులో 'ఏక్ దో తీన్' పాట బాణీని కాపీ కొట్టి రాధపై చిత్రీకరించినా కూడా ఆ పాట హిట్ కాలేదు. ఇక విషయానికి వస్తే మరలా ఇంత కాలానికి బాలీవుడ్‌లో మరోసారి 'ఏక్ దో తీన్' అనే పాటను రీమిక్స్ చేశారు. ఈ చిత్రం సాంగ్ టీజర్‌ని చూసినప్పుడే అందరికీ తేడా కొట్టింది. తీరా ఈ పాట లిరిక్ విడుదలైన తర్వాత వింటే అసలు పాత పాటలో వందో శాతం కూడా న్యాయం చేయలేదని అర్ధమవుతోంది.
ఇక మాధురి పాట కావడంతో డ్యాన్స్‌లో బాగా చేస్తుంది అనే పేరున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేత ఈ పాటను చేయించారు. 2016లో వచ్చిన 'వర్షం' రీమేక్ 'బాఘీ'కి ఇది సీక్వెల్. 'బాఘీ'లో సుధీర్‌బాబు కూడా విలన్ గోపీచంద్ పాత్రను చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ 'బాఘీ 2' చిత్రం తెలుగులో వచ్చిన 'క్షణం' చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది. కానీ 'బాఘీ 2' ట్రైలర్ చూస్తే అంత హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది. ఇక ఈ 'బాఘీ 2'లో నిజజీవితంలోని ప్రేమికుల జంట అయిన టైగర్ ష్రాఫ్, దిశాపటానీ నటిస్తున్నారు. ఈనెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ పాటలో మోహినీగా జాక్వెలిన్ నర్తించింది. పాత మాధురీ దీక్షిత్ పాటను ప్రముఖ గాయని అల్కాయాగ్నిక్ పాడగా, తాజాగా పాటను శ్రియాఘోషల్ ఆలపించింది. స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన అహ్మద్‌ఖాన్ పాత పాటలోని స్టెప్స్ జోలికి పోకుండా దీనిని కంపోజ్ చేశాడు. ఒకే ఒక్క బిట్ మాత్రమే కాపీ కొట్టారు. ఇక ఈ పాటలో నటించమని అడిగితే మాధురీలా తాను డ్యాన్స్ చేయలేనని భయపడ్డానని, కానీ వాటి స్టెప్పులు, ఇప్పటి స్టెప్పులు వేరు వేరు అని తెలియడంతో ఒప్పుకున్నానని జాక్వెలిన్ చెబుతోంది. ఇక ఈ పాటలో ఒక్క క్షణం పాటైనా మాధురీ దీక్షిత్‌ని నటింపజేయాలని ప్రయత్నించినా ముందు చూపుతో మాధురి నో చెప్పింది. లేకపోతే ఆమె పరువు కూడా పోయేది. ఇక పాత 'ఏక్‌దో తీన్' పాట ఏడు నిమిషాలు ఉండగా, ఈ తాజా రీమిక్స్ పాట రెండు నిమిషాల నిడివి కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.