దాదాపు 20 ఏళ్లకు పైగా కేవలం తల్లే తన లోకంగా అతిలోక సుందరి శ్రీదేవి పెద్దకూతురు జాన్వి పెరిగింది. ఈమెకి బయటి వారితో పెద్దగా ఫ్రెండ్‌షిప్స్ ఉండేవి కాదట. కేవలం తన తల్లినే మంచి స్నేహితురాలిగా భావిస్తూ, ప్రతి విషయాన్ని తల్లికి చెప్పి, ఆమె చెప్పిన దారిలో నడిచేదని, ఆమె అమ్మకూచి అని అంటారు. అలాంటి తల్లి హఠాన్మరణం ఆమెని బాగా కుంగదీసింది. అయినా కూడా ఆమె హీరోయిన్‌గా తాను తెరంగేట్రం చేస్తున్న 'ధడక్' చిత్రం కోసం ఆ బాధని పంటి బిగువున దాచి ఉంచి షూటింగ్‌లో పాల్గొంటూ దర్శకనిర్మాతలకు తన సహకారం అందిస్తోంది. ఇక ఈమె తాజాగా నాడు అతిలోకసుందరి తర్వాత డ్యాన్స్, నటన, అందంలో పోటీపడిన మాధురీ దీక్షిత్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. విషయానికి వస్తే శ్రీదేవి బతికి ఉండి ఉంటే కరణ్‌జోహార్ తీయాలని భావించిన 'షద్దత్' చిత్రంలో ఆమె నటించి ఉండేది. ఈ చిత్రం కథ, ఇందులోని తన తల్లిపాత్ర తన తల్లి మనసుకు ఎంతో దగ్గరైన పాత్ర, సినిమా అంటూ జాన్వి తెలియజేసింది. అలాంటి తన తల్లి నటించే చిత్రంలో ఆమె బదులు నటిస్తున్న మాధురీ దీక్షిత్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
ఈ చిత్రంలో భాగమవుతున్నందుకు మాధురీ దీక్షిత్‌కి తన సోదరి ఖుషీ, తండ్రి బోనీకపూర్‌ల తరపున తాను శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చింది. వీటితో పాటు ఆమె ఓ రియాల్టీ డ్యాన్స్‌షోలో శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కలిసి ఉన్న ఓ ఫొటోని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక 'షద్దత్' చిత్రాన్ని కరణ్‌జోహార్‌తో కలసి సాజిద్ నడియావాలా, ఫాక్స్‌స్టార్ స్టూడియోలు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సంజయ్‌దత్, అలియాభట్, వరుణ్‌ధావన్, ఆదిత్యారాయ్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ఇక శ్రీదేవి చివరగా నటించిన చిత్రం 'మామ్'. అయితే ఆమె తాజాగా షారుఖ్‌ఖాన్ నటిస్తున్న 'జీరో' చిత్రంలో కూడా ఓ ప్రత్యేక అతిధిపాత్రను చేసిందని, దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తవ్వడంతో ఈ చిత్రం ద్వారా శ్రీదేవిని చివరిసారిగా వెండితెరపై చూసే అవకాశం ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం శ్రీదేవి ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది కానీ ఆమె పాత్ర చిత్రీకరణ మొదలేకాలేదని అంటున్నారు మరి వీటిల్లో ఏది నిజమో తెలియాల్సివుంది...!