కమెడియన్ ఆలీ హీరోగా కూడా ఎన్నో చిత్రాలలో చేశాడు. వాటిల్లో మొదట వచ్చిన చిత్రం 'యమలీల'. నాడు బాలీవుడ్‌కి చెందిన దివ్యభారతి తెలుగు సినిమాలో వెలిగిపోతోంది.. ఆమె తమిళ హీరో ప్రశాంత్‌తో కలిసి బాలీవుడ్ 'దిల్'కి రీమేక్‌గా 'తొలిముద్దు' చిత్రం చేస్తోంది. నేను కూడా అందులో నటించాను. ఆమెకి తెలుగు రాదు. హిందీ మాత్రమే వచ్చు. దాంతో నాకు వచ్చిన హిందీలో ఆమెకి నటనలో, డైలాగ్‌లు, లిప్‌మూమెంట్ వంటి విషయాలలో సహాయం చేసేవాడిని, ఆమె కూడా నా భుజాలపై చేతులు వేసి ఎంతో ఫ్రెండ్లీగా ఉండేది. ఆమె ఓ రోజు మాట్లాడుతూ, అలీ గారు మీరు హీరో అయితే నేను మీ పక్కన హీరోయిన్‌గా చేస్తాను అని చెప్పింది. ఆమె బతికి ఉంటే 'యమలీల'లో ఇంద్రజ బదులు, దివ్యభారతి హీరోయిన్‌గా నటించి ఉండేది. నేను ఎప్పుడు క్యారవాన్‌లో ఉండను. ఏ షాట్ తీస్తున్నా కూడా సెట్స్‌లోనే ఉంటాను. స్క్రిప్ట్ చదివితే 50శాతం మాత్రమే అర్ధమవుతుంది. రియల్ షాట్స్ చూస్తే 80 శాతంకి పైగా అర్ధమవుతుంది. నాజర్, సత్యరాజ్ వంటి వారు ఎప్పుడు సెట్స్‌లోనే ఉంటారు. ఇక నేను 'దేశముదురు' చిత్రం చేసేటప్పుడు కులుమానాలిలోని హిడింబ దేవాలయం వద్ద షూటింగ్ జరుగుతోంది. అందులో నాది స్వామీజీ పాత్ర. నా వెనుక నిజమైన అఘోరాలు ఉన్నారు. దాంతో కొందరు భక్తులు వచ్చి నేనే నిజమైన స్వామిని అని భావించి, పాదాలకు దణ్ణం పెట్టి, 'మహారాజ్, మహారాజ్' అంటూ వెళ్లిపోయారు.
ఇక మేము హిందు పండుగలు కూడా చేసుకుంటాం. మా రంజాన్‌కి వాళ్లకి బిర్యాని ఇస్తాం. వారు తమ పండుగలకి పులిహోర ఇస్తారు. అంతే తేడా. షూటింగ్‌లు, హోటళ్లలో భోజనం చేయను. ఎంత లేట్ అయనా ఇంటికే వెళ్లి భోజనం చేస్తాను. షూటింగ్‌లో ఉంటే సలాడ్ లేదా రసం మాత్రమే తింటాను. ఏమైనా తినాలనిపించినా నా సొంత డబ్బులతోనే తింటాను. నిర్మాత డబ్బులతో తినను. నిర్మాత నాకు రెమ్యూనరేషన్ ఇస్తున్నాడు. మరి ఆయన నా తిండి ఖర్చు ఎందుకు భరించాలి..? నాకు విలన్ పాత్ర చేయాలని కోరిక. కానీ తెలుగులో చేస్తే కామెడీ ముద్ర ఉండటంతో ఏడ్చావులే అంటారు. అందుకే ఇతర భాషల్లో క్రూరమైన విలన్ పాత్ర చేయాలని ఉంది. నా భార్యకు కూడా నేను విలన్‌గా చేస్తే చూడాలని కోరిక. ఇక నాడు కె.విశ్వనాథ్ గారు చిన్నతనంలో నా యాక్టివ్‌నెస్ చూసి 'ప్రెసిడెంట్ పేరమ్మ' చిత్రంలో రమాప్రభ కొడుకుగా వేషం ఇచ్చారు. 'దేవుడు మావయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి' వంటి చిత్రాలు చేశాను. కానీ నాకు బ్రేక్‌నిచ్చిన చిత్రం మాత్రం 'సీతాకోక చిలుక'. భారతీరాజా ఆ పాత్రకి ఎందరినో చూసిన సంతృప్తి చెందలేదు. రాజమండ్రిలో ఓ పిల్లాడు ఉన్నాడని నన్ను తీసుకొచ్చి చిన్న నిక్కరు, షర్ట్ ఇచ్చి గోచీ కూడా పెట్టారు. డిప్ప కటింగ్ కొట్టారు. ఆ తర్వాత 'ప్రేమఖైదీ' చిత్రం తర్వాత బ్రహ్మానందం, కోట, బాబూమోహన్ తర్వాత నేనే కమెడియన్‌గా బిజీ అయ్యాను అని చెప్పుకొచ్చాడు అలీ.