ఏపరంగా తీసుకున్నా కూడా రాజకీయంగా చంద్రబాబు ముందు జగన్ దేనికి సరితూగడు. ఆయన ప్రత్యేకహోదా గురించి టిడిపిని విమర్శిస్తాడే గానీ కేంద్రాన్ని పల్లెత్తుమాట అనడు. ఒకవైపు మోడీనే ప్రత్యేకహోదా ఇస్తాడని, కాబట్టి ఆయనకే మద్దతు ఇస్తాం అని చెబుతూనే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, ఎంపీలు రాజీనామాలు చేస్తారని, ఇలా గందరగోళంగా మాట్లాడుతున్నాడు. ఏప్రిల్ 6 వ తేదీలోగా కేంద్రం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకపోతే తమ ఎంపీలు ఏప్రిల్ 21న రాజీనామా చేస్తారని ప్రకటించాడు. ఇంత ఆలస్యంగా రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి కూడా ఉందదని, త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఇబ్బందులు ఉండవని జగన్ తెలివి తేటలు. ఇక ఈయన మోదీని ఏమీ అనకుండా, మరోవైపు కేసీఆర్‌ని తప్పుపట్టకుండా కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. ఇక కేసీఆర్ కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్‌దే అధికారం అని చిలకజోస్యం చెబుతూ, తాను జగన్ పక్షపాతినని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా జగన్ గత నాలుగేళ్లలో తెలంగాణలో ఎంతో బీడు భూమి సాగులోకి వచ్చిందని, లిఫ్ట్‌లు పెట్టి మరీ కేసీఆర్ నీటిని తోడిస్తున్నారని, చంద్రబాబు మాత్రం తన స్వార్థ ప్రయోజనాలను తప్ప రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించాడు. రైతులకు మేలు చేయడంలో కేసీఆర్‌కి ఉన్నది ఏంటి?బాబులో లేనిది ఏంటీ? అని ఆయన ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలోనే జగన్ అనుభవరాహిత్యం కనిపిస్తోంది. ఏపీ కొత్తగా రాజధాని కూడా లేనిరాష్ట్రం. తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉంటే ఏపీ విభజన వల్ల లోటు బడ్జెట్‌లో ఉంది.
ఇక ఇంత లోటు బడ్జెట్ అయినా ఉద్యోగులకు జీతాలు, రైతు రుణమాఫీలు, ఇతర అభివృద్ది పనులను చంద్రబాబు చేస్తున్నాడు. విదేశీ సంస్థలను ఏపీకి ఆకర్షించడంలో ఆయన నిజాయితీగానే కష్టపడుతున్నాడు. 'రోమ్‌ఈజ్ నాట్ బిల్ట్ ఇన్‌ఏ డే' అన్నట్లుగా మార్పు అనేది, అభివృద్ది అనేది అల్లావుద్దీన్ అద్భుత దీపం వంటిది కాదు. హైదరాబాద్ అభివృద్ది నుంచి ఏనాడో రాజీవ్‌గాంధీ కంప్యూటరీకరణను ప్రోత్సహిస్తే, పివి నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు చేస్తే ఇప్పుడు దాని ఫలితం కనిపిస్తోంది. కంప్యూటరీకరణ నుంచి మొబైల్స్, డిజిటల్ విప్లవం వంటి వాటికి బీజం వేసింది పీవీ, మన్మోహన్ వంటి వారే. కాబట్టి ఫలితం అనేది తదుపరి తరాలకు అందేలా విజన్ చూపించాలని చంద్రబాబు భావిస్తున్నాడు. కానీ జగన్ మాత్రం కేసీఆర్‌కి ఉన్నది ఏంటి? బాబుకు లేనిది ఏంటి? అని ప్రశ్నించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. పై నుంచి రావాల్సిన నీటిని తెలంగాణ అడ్డుకుంటుంటే చంద్రబాబు ఏమి చేయలేకపోతున్నాడని జగన్ అంటున్నారు. కేసీఆర్‌ని ధైర్యంగా విమర్శించి ఎగువ నీటిలో వాటా విషయంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టి, ఆ విషయంలో జగన్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? అనే ప్రశ్న మాత్రం ఉదయిస్తుంది. తామే ముందుగా అవిశ్వాసం పెట్టి క్రెడిట్ కొట్టేయాలని భావించిన వైసీపీ నాయకులకు టీడీపీ కేంద్రమంత్రుల చేత రాజీనామా చేయించడం, తానే అవిశ్వసానికి సిద్దం కావడం, ఎన్డీయే నుంచి తప్పు కోవడంతో ఫస్ట్రేషన్‌లో ఇలా మాట్లాడుతున్నాడని అర్ధమవుతోంది.