తెలుగు సినీపరిశ్రమలో దాసరి నారాయణరావు తర్వాత సినీ పెద్దగా తమ్మారెడ్డి భరద్వాజను చెప్పుకోవాలి. తెలుగు సినీకార్మికులకు ఈయనంటే ఎంతో ఇష్టం. ఇక ఈయన తీసే చిత్రాలు, మాట్లాడే మాటలు సామాజిక కోణంలో ఎంతో అర్ధవంతంగా ఉంటాయి. తప్పుచేస్తే తప్పు, మంచి చేస్తే మంచి అని కుండబద్దలు కొట్టే నైజం ఆయనది. ఈయన గతంలో పవన్ ప్రత్యేకహోదా కోసం వైజాగ్‌లో యువత సభకి మద్దతు పలికి ఆయన స్వయంగా రాకపోవడంతో తమ్మారెడ్డి ఆయనను విమర్శించాడు. ట్వీట్స్ చేయడం కాదు.. బయటికి వచ్చి మాట్లాడు. మీరు మాట్లాడితే పని జరుగుతుందని సూచించాడు. ఈయన కూడా ప్రత్యేకహోదా ఉద్యమం సమయంలో వైజాగ్ వచ్చాడు. ఇంత కాలం పవన్‌లోని లోపాలను ఎత్తిచూపిన తమ్మారెడ్డి తాజాగా జనసేన ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చేసిన ప్రసంగంపై ప్రశంసల వర్షం కురిపించాడు.
నాలాంటి వారో, చలసాని శ్రీనివాస్ వంటి వారో, లేక కమ్యూనిస్ట్‌లో మాట్లాడి ఉంటే మీడియా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ మాట్లాడింది పవన్‌కళ్యాణ్ కావడంతో మీడియా అంతా ఇది లైవ్‌లో వచ్చి ప్రజల్లో అటెన్షన్‌ని క్రియేట్ చేసింది. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని, కేంద్రం ఏపీని పట్టించుకోవడం లేదని, ఆమరణ దీక్ష చేస్తానని అంటే ఇప్పుడు ప్రజలందరు అదే సంగతి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను బయటికి వచ్చి పవన్‌ని మాట్లాడమని చెబుతూ వచ్చాను. ఇంతకాలానికి పవన్ ఎంతో బాగా గొప్పగా మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ చెప్పిన మాట మీదే ఉండి, చెప్పిన ప్రకారం చేస్తే ఏపీకి ఖచ్చితంగా ప్రత్యేకహోదా వస్తుంది. ప్రతి పార్టీలో దొంగలు తగ్గుతారు. ఏపీలో మంచి పరిణామం వస్తుందని ఆశిస్తున్నాను. హ్యాట్సాఫ్ టు పవన్‌కళ్యాణ్.
ఎందుకంటే ఇంత వరకు నేను పవన్‌ని కాదని విమర్శించాను, పవన్ తీసుకున్న స్టాండ్ ఇలాగే ఉండాలి. స్టాండ్ మార్చకుండా ఉండి, ఏపీకి తెలంగాణకు మంచి మేలు చేస్తాడని, ఆయనకు ఆ పవర్ ఉందని, ఆయన ఫాలోయర్స్ మద్దతు ఆయనకు ఉందని నమ్ముతున్నాను... అంటూ పేర్కొన్నాడు.