ఆయన బిరుదులోనే మాస్ అని ఉంది. మాస్‌కి మహారాజ పోషకుడు ఆయన. ఈయన గతంలో 'నీకోసం, ఖడ్గం, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్, నేనింతే, శంభో శివ శంభో, సారొచ్చారు' వంటి విభిన్న ప్రయత్నాలు చేశాడు. 'నీకోసం, ఖడ్గం' వంటి చిత్రాలు మంచి హిట్స్‌గా నిలిచాయి. ఇక 'నేనింతే, శంభో శివ శంభో, నా ఆటోగ్రాఫ్'వంటి చిత్రాలు సరిగా కమర్షియల్ హిట్స్ కాకపోయినా కూడా ఈయనకు నటునిగా మంచి గుర్తింపును తెచ్చాయి. వరుసగా మాస్‌చిత్రాలు చేసే ఈయన వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మూడు చిత్రాలే ఆయనకు అందరినీ గుర్తుండేలా చేస్తాయి. ఇక మాస్ టచ్ ఉంటూనే అంధునిగా కనిపించే 'రాజా ది గ్రేట్' చిత్రం చేశాడు. ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఈ చిత్రం విడుదల టైం లో రవితేజ మాట్లాడుతూ.. ప్రజలు వైవిధ్యం కోరుకుంటున్నారని అలాంటి చిత్రాలే చేస్తానని చెప్పి మరలా రొటీన్‌కే రొటీన్ అయిన 'టచ్ చేసి చూడు' చేస్తే అది డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం ఆయన నటించిన ప్రయోగాత్మక చిత్రాలే కాదు.. ఎన్నో పక్కా రొటీన్ అయిన చిత్రాలు కూడా డిజాస్టర్స్‌గా నిలిచిన విషయం ఆయన మరలా మర్చిపోయాడు. నాకు తగ్గ, నా నుంచి ప్రేక్షకులు ఆశించే చిత్రాలే చేస్తానని చెబుతున్నాడు.
ఇక రవితేజ 'సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం'తో రెండు వరుస హిట్స్ కొట్టిన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఎంత రొటీన్‌గా ఉన్నా ఇందులో కాస్త వైవిధ్యం ఉంటుందని టైటిల్ నిరూపిస్తోంది. ఇక ఈయన శ్రీనువైట్లకు చాన్స్ ఇచ్చి 'అమర్ అక్బర్ ఆంటోని' చిత్రం చేస్తున్నాడు. మైత్రిమూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన మూడు పాత్రలు చేస్తున్నాడా? లేక మూడు గెటప్స్‌లో వేరియేషన్స్ చూపించనున్నాడా? అనేది చర్చనీయాంశం అయింది. ఇదే సమయంలో రవితేజ మరోసారి మరో వైవిధ్య చిత్రానికి ఓకే చెప్పాడట.
'టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం' చిత్రాలతో జయాపజయాలకు అతీతంగా డిఫరెంట్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా 'నేల టిక్కెట్' చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ తాళ్లూరినే నిర్మించడం విశేషం. ఇక ప్రస్తుతం 'శంభో శివ శంభో' దర్శకుడు సముద్రఖని దానికి సీక్వెల్‌ని తమిళంలో చేస్తున్నాడు. ఈచిత్రాన్ని ఆయన తెలుగులో రవితేజతో చేయాలని భావిస్తుండటంతో రవితేజ దీనికి కూడా ఓకే చెబితే ఆయన ఒకేసారి పలు విభిన్న చిత్రాలను చేస్తున్న ఘనతను సాధించడంతో పాటు రవితేజ ట్రాక్‌లోకి వచ్చేసినట్లే అనుకుంటున్నారు.