బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేసుకునే కైరా అద్వానీ టాలీవుడ్ లో మొదటి సినిమానే మహేష్ వంటి స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదటి సినిమానే భారీ నిర్మాణ సంస్థ, టాప్ డైరెక్టర్ తో చేస్తుంది. మరి అలాంటి బడా ప్రాజెక్ట్ లో అమ్మడు నటిస్తుంది అంటే... ఆటోమాటిక్ గా అందరి చూపు ఆమెపైనే ఉంటుంది. అందులోను అందగాడైన మహేష్ పక్కన కైరా అనగానే అందరిలో స్పెషల్ ఆసక్తి. అందుకే కైరా అద్వానీ నటిస్తున్న మొదటి సినిమా 'భరత్ అనే నేను' విడుదల కాకముందే మరో స్టార్ హీరో రామ్ చరణ్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్, కైరాతో రొమాన్స్ చేయనున్నాడు.
అలాగే మరికొంతమంది టాలీవుడ్ హీరోలు కైరా అద్వానీని తమ సినిమాలో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో అమ్మడు చెట్టెక్కి కూర్చుంది. తన మొదటి సినిమా పారితోషికం కన్నా డబుల్ చేసి తన వద్దకు వచ్చిన దర్శక నిర్మాతలను బెదరగొడుతుందట. మరి ఆ పెంచేసిన పారితోషకాన్ని ఇచ్చెయ్యడానికి నిర్మాతలు వెనుకాడడం లేదట. మరి ఒక్కసారిగా కైరా కి అంత క్రేజ్ ఎలా వచ్చిందో తెలియదు గాని.. అమ్మడు మాత్రం నక్కతోక తొక్కి టాలీవుడ్ కి దిగిందనేది మాత్రం అర్ధమవుతుంది. అయితే కైరా అద్వానీ, మహేష్ తో కలిసి 'భరత్ అనే నేను' లో నటించడానికి కేవలం 50 లక్షలు మాత్రమే తీసుకుందట.
మరి భరత్ కి 50 లక్షలందుకున్న కైరా అద్వానీ రామ్ చరణ్ - బోయపాటి సినిమా కోసం కోటి డిమాండ్ చేసి నిర్మాతల దగ్గర నుండి ఆ కోటిని సాధించుకుందట. మరి భరత్ అనే నేను గనక విడుదలై హిట్ అయ్యిందా ఇక అమ్మడు రేంజ్ ఒకేసారి రెండు కోట్లకు పెరిగినా ఆశ్చర్య పోవక్కర్లేదంటున్నారు ఫిలింనగర్ వాసులు.