నాటి నుంచి నేటి వరకు ఎవరైనా హీరోయిన్లు, ఇతర నటీమణులు చంద్రమోహన్‌తో కలిసి నటిస్తే వారు స్టార్ హీరోయిన్స్ అయిపోయేవారనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. నాటి శ్రీదేవి, జయప్రద, జయసుధ నుంచి సుహాసిని, భానుప్రియ, విజయశాంతి నుంచి ఖుష్బూ వరకు ఇది ఎందరి విషయంలలోనో నిరూపితమైంది. ఇక జయసుధ విషయానికి వస్తే పెంకి పెళ్లాంగా, మొండిఘట్టంగా, చలాకీ గ్రామీణ యువతిగా, సిటీ గర్ల్‌గా, బరువైన పాత్రలను కూడా ఎంతో హృద్యంగా పండిస్తుంది. దాంతో ఆమె అందం, అభినయం కలగలిసిన సహజనటిగా పేరు తెచ్చుకుంది.
ఇక ఈమె ఇప్పటికీ కూడా తల్లి, అత్త పాత్రలలో యమా బిజీ. మంచి బరువైన పాత్ర, మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర అంటే అందరు జయసుధ వైపే దృష్టిసారిస్తారు. ఈమె తాజాగా మాట్లాడుతూ, నేను నా కెరీర్‌లో చంద్రమోహన్‌తో ఎన్నో చిత్రాలలో నటించాను. ఆయనతో చేస్తుంటే నటించినట్లు ఉండదు. ఏదో సరదాగా, సహజంగా యాక్ట్ చేసినట్లు ఉంటుంది. ఆయన కూడా ఎంతో బాగా నటిస్తారు. మాది నాడు మంచి హిట్ పెయిర్. ఆయనతో నటిస్తే స్టార్ హీరోయిన్స్ అయిపోతారనే సెంటిమెంట్ కూడా అన్నిసార్లు ప్రూవ్ అయింది.
ఇక మా సొంత చిత్రం 'కలికాలం'లో కూడా ఆయన అద్భుతంగా నటించాడు. ఇప్పటికి కూడా ఫోన్ చేసి మరీ నా యోగ క్షేమాలు, ఇతర విషయాలు మాట్లాడుతూ, స్నేహంగా, ఆత్మీయంగా ఉంటారు అని చెప్పుకొచ్చింది. నేటి రోజుల్లో సందీప్‌కిషన్‌తో నటించి హీరోయిన్లు కూడా ఇలాగే బాగా పైకి వస్తారనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.