మొన్నటితరంలో శ్రీదేవి, జయప్రద, జయసుధల మధ్య టాలీవుడ్‌లో పోటా పోటీ వాతావరణం ఉండేది. నాడు గ్లామర్ క్వీన్‌గా, డ్యాన్స్‌లు బాగా వేయగలిగిన నటిగా శ్రీదేవి ఓ వెలుగు వెలిగింది. జయప్రద అయితే ఇండియాలోని సినీ నటీమణలందరిలోకి ఈమెనే అందగత్తె అని సత్యజిత్‌రేయ్ వంటి దర్శకుడే పొగిడాడు. వీరిద్దరు బాలీవుడ్‌కి వెళ్లిన కూడా సహజనటిగా జయసుధ మాత్రం తన కెరీర్‌ని అద్భుతంగా కొనసాగిస్తోంది. ఈమె దాసరి నారాయణరావు నుంచి రాఘవేంద్రరావు వరకు ప్రతి దర్శకనిర్మాత మంచి నటనా సామర్ధ్యం ఉన్న పాత్రని కేవలం జయసుధకే ఇచ్చేవారు. ఆమె నటన ఎంతో సహజంగా ఉంటుందే గానీ ఏమాత్రం నటనా ఛాయలు కనిపించవు. ఇక దుస్తుల నుంచి అన్ని విషయాలలోనూ ఆమంటే ఫ్యామిలీ ప్రేక్షకులు, మహిళా ప్రేక్షకులు పిచ్చిగా అభిమానించేవారు. ఆమె నటించిన చిత్రం అంటే ఏదో బలమైన కథ, పాత్రలు ఉంటాయనే ముద్ర నాటి ప్రేక్షకులలో ఉండేది.
ఇక ఆ తర్వాత సుహాసిని మాత్రమే ఆ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు నుంచి సుమన్, చిరంజీవి, చంద్రమోహన్ వరకు అందరితో ఆమె నటించింది అనే కన్నా జీవించింది అనే చెప్పాలి. ఇలా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి మరోకరు లేరు. ఇక జయసుధ తాజాగా మాట్లాడుతూ, నేను హీరోయిన్‌గా చేసినా, లేదా ఇప్పుడు హీరో, హీరోయిన్లకు తల్లి వంటి సపోర్టింగ్ రోల్స్ చేసినా పాత్రలు, సినిమా కథలు సహజంగా ఉన్నాయా? లేవా? అనేదే ముందు చూస్తాను. అవి బాగా లేకపోతే నేను చేయనని తిరస్కరించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. నా పాత్రను తీర్చిదిద్దిన విధానంలో నాకేమైనా తేడా కనిపిస్తే నో చెప్పేదానిని. నా పాత్ర చెప్పే డైలాగ్స్ బాగా లేకపోయినా, సహజంగా లేకపోయినా, ఏమైనా అసభ్యం, చీప్‌గా ఉన్నా కూడా నేను చెప్పేదానిని కాదు.
ఇక బయట ఇలా జరగదు కదా.. ఇదంతా సినిమాటిక్‌గా ఉందని అనిపిస్తే నో చెప్పేదానిని. నాకు తెలుగు చదవడం, రాయడం రాకపోయినా డైలాగ్‌లను స్పష్టంగా నేర్చుకుని చెప్పేదానిని అని చెప్పుకొచ్చింది. మరి ఈ కాలంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా..?