ఏ భాషలోనైనా ఒక సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు ఆ సినిమా రీమేక్ కోసం వేరే భాష నటులు తోపాటు దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తుంటారు. కొన్నిసార్లు ఒక భాషలో హిట్ అయిన సినిమాలు డబ్బింగ్ తో విడుదల చేసేస్తే కొన్నిసార్లు మాత్రం రీమేక్ చెయ్యాలనే చూస్తారు హీరోలు. తెలుగులో అలా ఎక్కువగా పరభాషా హిట్ సినిమాలను రీమేక్ చేసే హీరోలలో వెంకటేష్ ముందుంటాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యన రీమేక్ లనే నమ్ముకుంటున్నాడు. గత కొంతకాలంగా సీనియర్ హీరో వెంకటేష్ మాత్రం ఎక్కువగా రీమేక్ సినిమాల మీదే ఆధారపడుతున్నాడు.
అలా దృశ్యం, గురు సినిమాల్తో వెంకటేష్ హిట్ కూడా కొట్టాడు. అయితే ప్రస్తుతం ఒక ఒరిజినల్ కథతో తేజ డైరెక్షన్ లో 'ఆటా నాదే వేట నాదే' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీదకెళ్లబోతుంది. మరి ఈ ఏడాది దాదాపు నాలుగు సినిమాలు ప్రేక్షకులకు అందిస్తానని వెంకీ తన అభిమానులకు ప్రామిస్ కూడా చేసాడు. అందుకే తాజాగా తేజతో ఒక సినిమాని పట్టాలెక్కించిన వెంకీ ఇప్పుడు మరో మలయాళం మూవీ ని రీమేక్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. మలయాళంలో హిట్ అయినా ది గ్రేట్ ఫాదర్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలని వెంకీ ప్రయత్నిస్తున్నాడట.
మమ్ముట్టి హీరోగా నటించిన ది గ్రేట్ ఫాదర్ సినిమాని తమిళంలో విక్రమ్ రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతుంటే... ఇప్పుడు తెలుగులో వెంకటేష్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ ని తెరకెక్కించిన దర్శకుడు హనీఫ్ ఏ తమిళంలోనూ దర్శకుడిగా చేస్తాడని తెలుస్తుంది. మరి తెలుగులో వెంకీ హీరోగా డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.