ఇప్పుడు మన సినీ మేకర్స్ ఏమి చేసినా ఫర్వాలేదు..తమ చిత్రాలకు ప్రమోషన్స్ కావాలని, ప్రేక్షకులకు దగ్గర కావాలని ఆశిస్తున్నారు. వీటికి 'అర్జున్‌రెడ్డి' వంటి చిత్రాలు ఆదర్శంగా నిలిచాయి. తమదైన యాటిట్యూడ్ చూపిస్తూ, వేడుకలోనే వచ్చిన ప్రేక్షకుల చేత బూతులు పలికించడం, పోస్టర్లలో లిప్‌లాక్‌లు వంటివి హైలైట్ చేయడం, వాటిని వి.హనుమంతరావు వంటి వారు ఖండిస్తే చిల్ తాతయ్యా అని సెటైర్లు వేయడం ద్వారా ఆ చిత్రానికి కావాల్సినంత మైలేజీ వచ్చింది. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఎవరి అండదండలు లేకుండా తనదైన టాలెంట్‌తో ముందుకు సాగుతున్న హీరోలలో శ్రీవిష్ణు ఒకడు. ఆయన నారా రోహిత్‌తో 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంలో తన నటనతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన 'మెంటల్ మదిలో' చిత్రం కూడా బాగానే ఆడింది. చాలా మందికి నచ్చింది. ప్రస్తుతం శ్రీవిష్ణు 'నీది నాది ఒకే కథ' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం 23న విడుదల కానుంది.
అదే రోజున కళ్యాణ్‌రామ్ 'ఎమ్మెల్యే' రిలీజ్ ఉన్నప్పటికీ దీనిని కూడా అదే తేదీన ఫిక్స్ చేశారు. ర్యాంకులు సాధించినోడే నిజమైన విద్యార్ధి, ఉద్యోగం సంపాదించుకున్న వాడే ప్రయోజకుడు అనే భావాలను తూర్పారపడుతూ, ఓ మంచి సామాజిక స్పృహ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీవిష్ణు స్నేహితుడు నారా రోహిత్ సమర్పిస్తుండగా, శ్రీవిష్ణు భార్య ప్రశాంతి, 'అసుర' దర్శకుడు కృష్ణ విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అప్పట్లో ఒకడుండే వాడు' కూడా ఇదే కాంబినేషనలో రూపొందింది. ఇక ఈ చిత్రానికి వేణు ఉడుగుల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి.
ఇక రాయలసీమ యాసలో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్స్ కూడా ప్లస్ కానున్నాయి. 'బిచ్చగాడు' ఫేమ్ సనా టిట్యూస్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇందులోని కాసర్లశ్యామ్ రాసిన ఓ పాటను ఇటీవల విడుదల చేశారు. 'ఏందిరా జనాల గోల' అని లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకున్న యువకుడు పాడే పాటగా సాగుతున్న ఇందులో 'చావదె...', ఫ.. అనే బూతు పదాలు వినిపిస్తున్నాయి. మొదట్లో ఏదో తప్పు విన్నాం అని రిపీట్ చేసుకుంటే ఈ పదాలు మరింత స్పష్టంగా అర్ధమవుతున్నాయి. ఇవి ఎలాగూ సెన్సార్‌లో మ్యూట్ చేస్తారు కాబట్టి పబ్లిసిటీ పరంగా ఈ పాట వర్కౌట్ అవుతుందనేది మేకర్స్ దృక్పధంగా కనిపిస్తోంది.