బాహుబలి చిత్రంలో నటించిన హీరో హీరోయిన్లకే కాదు.. అందులోని చిన్న చిన్న పాత్రలు చేసిన వారికి కూడా దేశ విదేశాలలో ఎంతో గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా మాహిష్మతి రాజ్యానికి, సింహాసనానికి నమ్మిన బంటుగా ఉండే కట్టప్ప పాత్రలో సత్యరాజ్ జీవించాడు. ఇందులో దర్శకుడు రాజమౌళి కృషి కూడా ఎంతో ఉంది. అసలు 'బాహుబలి-ది బిగినింగ్' తర్వాత 'బాహుబలి-ది కన్‌క్లూజన్'కి అంతగా రెస్పాన్స్ లభించిందంటే అది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే పాయింట్ మీదనే అనడంలో సందేహం లేదు. ఈ పాత్రను రాజమౌళి మలిచిన తీరు అనన్యసామాన్యం.
ఇక తన కెరీర్‌లో దాదాపు 200లకు పైగా చిత్రాలలో నటించిన తమిళ సీనియర్ స్టార్ సత్యరాజ్ ఇంతకాలం తమిళం, కాస్త కాస్త తెలుగులో మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ 'కట్టప్ప'గా మాత్రం ఆయన పేరు దేశవిదేశాలలో మార్మోగిపోయింది. బాహుబలి, శివగామి, భళ్లాలదేవ, దేవసేన తర్వాత అంతటి క్రేజ్ కట్టప్పకే వచ్చింది. ఇక ఈయనకు ప్రస్తుతం ఓ అరుదైన గౌరవం లభించింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో కట్టప్పని పోలిన మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీనికి సంబంధించిన ఆ మ్యూజియం నిపుణులు సత్యరాజ్ శరీర కొలతలు తీసుకోవడానికి రానున్నారు. ఇంతకు ముందే ఇదే మ్యూజియంలో బాహుబలిగా ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఈ మ్యూజియంలో కూడా బాహుబలి విగ్రహానికి కట్టప్ప కాపలా కాయడం ఖాయమని తేలిపోయింది.
ఈ విషయాన్ని మ్యూజియం వారు ప్రకటించగా, సత్యరాజ్, ఆయన కుమారుడు శిబిరాజ్‌లు ఈ విషయాన్ని ఖరారు చేశారు. మరో విశేషం ఏమిటంటే కోలీవుడ్ నుంచి మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో విగ్రహం ప్రతిష్టించే అరుదైన గౌరవం పొందిన తొలి తమిళ నటుడు సత్యరాజే కావడం విశేషం.