తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తృతీయఫ్రంట్ గురించి మాట్లాడటం, వీలుంటే తానే నాయకత్వం వహిస్తానని అనడంతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నారని, ఆయన తనయుడు కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేసి ఆయన ఢిల్లీలో ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆయన మేనల్లుడు హరీష్‌రావుని తన తనయుడికి పోటీ లేకుండా చేసేందుకు ఎంపీగా పంపించాలని భావిస్తున్నారని, దాంతో హరీష్‌రావు పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక హరీష్‌రావుకి రాజకీయ బిక్ష పెట్టింది కేసీఆరే. ఇక హరీష్‌రావు కూడ ఉద్యమాలు, త్యాగాల నుంచి వచ్చిన వాడే. ఆయన తన పార్టీ ఆదేశానుసారం రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి, ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేశాడు. కాబట్టి హరీష్‌రావు పార్టీ మారుతాడనే వ్యాఖ్యలలో ఏ లాజిక్కు కనిపించడం లేదు.
ఇక కిందిస్థాయి నుంచి ఎదిగి, ప్రజల్లో నిత్యం ఉండే నేతగా పేరు తెచ్చుకున్న హరీష్‌రావు పార్టీ మారడం అనేది కలలోని మాటే అని ఎవరైనా చెబుతారు. ఈయన మీడియాతో కూడా ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంతో కూల్‌గా, ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఆయనకు ఇలాంటి వార్తాకథనాలు రావడం, మరీ ముఖ్యంగా సోషల్‌మీడియాలో రావడంతో ఆయన సహనం కోల్పోయారు. ఇలాంటి వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్‌రెడ్డిని కూడా ఆదేశించామని తెలిపాడు. ఇక గత రెండు రోజుల నుంచి మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఏపీకి ప్రత్యేకహోదాను బిజెపి ఇవ్వకపోవడంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాజీనామా చేస్తే అదే రోజు ప్రత్యేకహోదా వస్తుందని, ఆయన హీరో అవుతాడని హీరో శివాజీ వ్యాఖ్యానించాడు. దానికి దర్శకరచయిత బి.విఎస్ రవి కూడా మద్దతు తెలిపాడు.
కానీ కాంగ్రెస్, తెలుగుదేశం వంటి పార్టీల వంటిది కాదు బిజెపి. వామపక్షాలు, బిజెపిలు సిద్దాంతాల ప్రాతిపదికన గట్టిగా ఉంటాయి. ఈ రెండు పార్టీలలో వ్యక్తుల కంటే సిద్దాంతాలు, పార్టీనే గొప్ప అని భావిస్తారు. ఇప్పుడు మోదీ తరహా నాయకులు వస్తున్నారుగానీ నిన్నటివరకు వాజ్‌పేయ్, అద్వానీ, మురళీమనోహర్‌జోషి వంటి వారు తాము అనుకున్న ప్రాధాన్యత ఇవ్వకపోయినా, లేకపోయినా, తమ మాటను పట్టించుకునే నాథుడు లేకపోయినా మౌనంగా ఉంటారే గానీ పార్టీని వదిలే ప్రశ్నేలేదు. ఇలా పార్టీ మారిన వారు బయటి పార్టీలలో రాణించిన దాఖలాలు కూడా లేవు.
నాడు వామపక్షాలు నిర్ణయం కారణంగానే జ్యోతిబసుకి ప్రధానమంత్రి పదవి, సోమ్‌నాథ్ చటర్జీకి మంచి అవకాశాలు మిస్సయినా వారు పార్టీ నిర్ణయానికే కట్టుబడ్డారు. బిజెపిలో వెంకయ్య కూడా అలాంటి వాడే. ఆయన మొదట బిజెపి నాయకుడు. తర్వాతే ఆయన ఆంధ్రుడు. ఆయనకు పార్టీనే ముఖ్యం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి కాబట్టి ఆయనకంటూ పార్టీ ఉండదు గానీ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసేటప్పుడు నన్ను ఇంత వాడిని చేసిన నా సొంత అమ్మలాంటి బిజెపి పార్టీ ఆఫీస్‌కి నేను ఇక వెళ్లకూడదు.. అనే విషయం కన్నీరు తెప్పిస్తోందని ఉద్వేగం చెందారు. ఇక తాజాగా ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి తృతీయ ఫ్రంట్‌ని ముందుండి నడిపిస్తాడని, ఆయనకు ఏపీ అంటే అంత ఇష్టమని వార్తలు వస్తున్నాయి. ఈ రెండింటిలో 'పసలేని పులిహోర' కథనాలే కనిపిస్తున్నాయి.