నాని డ్యూయెల్ రోల్ చేస్తూ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. మరి కృష్ణార్జున యుద్ధం అంటే... కృష్ణుడు, అర్జునుడు యుద్ధమో లేకపోతే.... ఏమో తెలియదు గాని... నాని ఒక లుక్ మాస్, మరో లుక్ క్లాస్ గా ఇరగదీస్తున్నాడు. క్లాస్ కన్నా మాస్ లుక్ లోనే అదరగొడుతున్న నాని ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఇద్దరు నానీల సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు నటిస్తున్నారు. మరి కృష్ణార్జున టీజర్ లో నాని నటన ఈ హీరోయిన్స్ నటన ఎలా ఉందంటే...
నాని లుంగీ చొక్కాలో మాస్ గా ఒక అమ్మాయిని పడేసి ఆ అమ్మాయికోసం ఎలాంటి పనైనా చేసే క్యారెక్టర్ లో ఇరగదీస్తూనే కామెడీకి కూడా కొదవలేకుండా పండించేస్తున్నాడు. నాని తాగుతూ 'ఆడోల్లు భలే కఠినాత్ములురా' అంటూ బాధగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుండగా.... అలాగే మాస్ కృష్ణ ఉరఫ్ నాని ఒక నాటకాన్ని రక్తి కట్టించే విషయంలో 'రామనాయణం అంతా విని ధర్మరాజు ఎవరిని అడిగిందట నీలాంటి సోంబేరి మొహంది' అంటే.. పక్కన ఉండే అతను రామాయణంలో ధర్మరాజు ఎందుకు ఉంటాడురా అనగా అతని చెంప పగలగొట్టి మరి.. ఒప్పించడంతో.. అతను ఉంటాడుంటాడు ఇంతగట్టిగా కొట్టిన తర్వాత రామాయణంలో ధర్మరాజు ఏం ఖర్మ రెబల్ స్టార్ కృష్ణం రాజు.. ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఉంటారని చెప్పే కామెడీ పంచ్ లు బావున్నాయి.
ఇక అర్జున్ గా క్లాసీ లుక్ లో ఉన్న నాని సీనియర్ కేరెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీతో కలిసి చేసే కామెడీతోపాటు... అమ్మాయిలను పడేయాలని చూస్తూ అనుపమ పరమేశ్వరన్ విషయంలో మాత్రం షాక్ తినే పాత్రలో అదరగొట్టాడు. మరి రెండు రకాల లుక్స్ లో నటించిన వీరిద్దరూ ఎలాంటి సిట్యువేషన్ లో కలిసి కొట్టుకుంటారనేదే ఈ 'కృష్ణార్జున యుద్ధం' సినిమా అని అర్ధమవుతుంది. మరి నాని డ్యూయెల్ రోల్ తోపాటు హీరోయిన్ అందాల చిందులు కూడా ఈ సినిమాకి ప్లస్ అనిపించేలా ఉన్నాయి. ఇక 'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్ 12 న వస్తుంది కాస్కోమంటున్నాడు హీరో నాని.